ఐపీఎల్‌లో బెంగళూరుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. చెన్నై చేతిలో వికెట్లతో బెంగళూరు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు జట్టు నిండా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నా అవసరానికి అందరూ హ్యాండిచ్చారు. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్(70: 50 బంతుల్లో, 5 ఫోర్లు, మూడు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (53: 41 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) మినహా ఇంకెవరూ ఆడకపోవడంతో ఒక దశలో 200 చేసేలా కనిపించిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(38: 26 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాఫ్ డుఫ్లెసిస్(31: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), రాయుడు (32: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో ఆరు వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బెంగళూరు మూడో స్థానంలోనే ఉంది.


200 కొట్టేలా కనిపించినా..
బెంగళూరుకు ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్(70: 50 బంతుల్లో, 5 ఫోర్లు, మూడు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (53: 41 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభం అందించారు. ధోని బౌలర్లను ఎంత మార్చినా వీరిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వీరి దూకుడైన ఆటతో బెంగళూరు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వీరి ఊపును చెన్నై బౌలర్లు ఆపలేకపోయారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థసెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. మొదటి వికెట్‌కు 111 పరుగులు జోడించిన అనంతరం 14వ ఓవర్‌లో బ్రేవో బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి కోహ్లీ అవుటయ్యాడు.


ఆ తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా మందగించింది. పడిక్కల్, డివిలియర్స్(12: 11 బంతుల్లో,  ఒక సిక్సర్) భారీ షాట్లకు ప్రయత్నించినా కనెక్ట్ కాలేదు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వీరిద్దరినీ వరుస బంతుల్లో అవుట్ చేసి శార్దూల్ ఠాకూర్ చెన్నైకి అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. అప్పటికి జట్టు స్కోరు 17 ఓవర్లలో 140 పరుగులుగా ఉంది. ఆస్ట్రేలియా హిట్టర్ మ్యాక్స్‌వెల్ (11: 9 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా మెరుపులు మెరిపించలేకపోయాడు. దీంతో ఒక దశలో 200 పరుగులు చేసేలా కనిపించిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 156 పరుగులకే పరిమితం అయింది. చివరి రెండు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఆరు పరుగులు మాత్రమే చేయడం బెంగళూరు బ్యాట్స్‌మెన్ వైఫల్యానికి అద్దం పడుతుంది. డ్వేన్ బ్రేవో(3/24), శార్దూల్ ఠాకూర్ (2/29) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రధానంగా వికెట్ అవసరమైన ప్రతిసారీ తన మార్కు బౌలింగ్‌తో బ్రేవో చెన్నైకి బ్రేక్ అందించాడు.


Also Read: యువీ.. గౌతీ తోడుగా ధోనీసేన అద్భుతం చేయగా! టీ20 ప్రపంచకప్‌ గెలిచి 13 ఏళ్లు


ఎక్కడా తడబడకుండా..
బెంగళూరు తరహాలోనే చెన్నైకి కూడా అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(38: 26 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాఫ్ డుఫ్లెసిస్(31: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో చెన్నై వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో చాహల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ చేతికి క్యాచ్ ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే డుఫ్లెసిస్‌ను కూడా అవుట్ చేసి మ్యాక్స్‌వెల్ బెంగళూరుకు రెండో వికెట్‌ను అందించాడు. ఈ క్రమంలో 10 ఓవర్లకు జట్టు స్కోరు 78-2ను చేరింది.


ఆ తర్వాత స్కోరును ముందుకు నడిపించే బాధ్యతను మొయిన్ అలీ(23: 18 బంతుల్లో, 2 సిక్సర్లు), రాయుడు (32: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) భుజాన వేసుకున్నారు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లోనే జట్టు స్కోరు 100 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత మొయిన్ అలీని హర్షల్ పటేల్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే రాయుడుని కూడా హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. అప్పటికి 26 బంతుల్లో 24 పరుగులు కావాల్సి ఉండగా.. ధోని(11 నాటౌట్: 9 బంతుల్లో, 2 ఫోర్లు), రైనా(17 నాటౌట్: 10 బంతుల్లో, 2 ఫోర్లు, ఒక సిక్సర్) మ్యాచ్‌ను ముగించారు.


Also Read: అర్థం లేకుండా కోహ్లీ ఆట.. చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ!


Also Read: నటరాజన్‌ స్థానంలో మరొకరిని తీసుకున్న సన్‌రైజర్స్‌.. ఎవరో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి