ఆపదలో ఉన్న మహిళల రక్షణకోసం, తక్షణ పోలీస్ సాయం కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్, దిశ హెల్ప్ లైన్ నెంబర్.. నిజంగా మహిళల పాలిట వరప్రదాయినిగా మారిందని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. దిశ యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసి పోలీసులకు కాల్ చేయడం ద్వారా నిండు గర్భిణి ప్రాణాలు నిలబడ్డాయి. ప్రసవం తర్వాత తల్లీబిడ్డ సంతోషంగా ఉన్నారు. తమ సంతోషానికి కారణం పోలీసులేనంటూ, దిశ యాప్ వల్లే తమ ఇబ్బందులు తొలగిపోయాయంటూ సంబరపడుతున్నారు ఆ కుటుంబ సభ్యులు..
ప్రకాశం జిల్లా, చీరాల మండలం, ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం వీవర్స్ కాలనీకి చెందిన పద్మ అనే గర్భవతి అర్థరాత్రి సమయంలో ప్రసవ వేదనకు గురైంది. పురిటి నెప్పులతో ఆమె తీవ్రంగా బాధపడుతుండగా ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ అందుబాటులో ఏ వాహనం లేదు. 108కి కాల్ చేసినా ఫలితం లేదు. అంబులెన్స్ లు సమీపంలో లేవని, వచ్చిన వెంటనే అక్కడికి పంపిస్తామని సమాధానం చెప్పారు. ఈలోగా పద్మకు నెప్పులు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో తెలీని కుటుంబ సభ్యులకు దిశ యాప్ చుక్కానిలా తోచింది. వెంటనే దిశ యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేశారు. కంట్రోల్ రూమ్ కి కాల్ వెళ్లింది. సిబ్బంది ఈ విషయాన్ని ఈపూరుపాలెం ఎస్సై సుబ్బారావుకి తెలియజేశారు. తక్షణం ఎస్సై స్పందించారు. హోం గార్డ్, కానిస్టేబుల్ ని పద్మ ఇంటికి పంపించారు. వారు నేరుగా ఆటో తీసుకుని అర్థరాత్రి సమయంలో ఎక్కడికి వెళ్లారు. పద్మను క్షేమంగా ఆస్పత్రికి తరలించారు. చీరాలలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పద్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
సకాలంలో పోలీసులు స్పందించి పద్మను ఆస్పత్రికి తరలించడం వల్లే తల్లిబిడ్డ ప్రాణాలు నిలిచాయని చెప్పారు వైద్యులు. ప్రసవ వేదనలో ఉన్న మహిళను ఆపద్భాంధవుడిలా దిశ యాప్ ఆదుకుందని, స్థానిక పోలీసుల చొరవని ఆ గ్రామ వాసులు ప్రశంసిస్తున్నారు. దిశ యాక్ కి వచ్చే ప్రతి కాల్ నీ ప్రత్యంకా చూడాలని జిల్లా ఎస్పీ మలిక గార్గ్ ఆదేశించారని, ఆమె ఆదేశాలకు అనుగుణంగా తాను నడుచుకుంటున్నారమని తెలిపారు ఎస్సై సుబ్బారావు.
ఆపదలో ఉన్న ఆడపిల్లలకు అండగా, ఓ అన్నలా దిశ యాప్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే దిశ యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా చోట్ల మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ పద్మ లాంటి ఉదంతాలు చూసిన తర్వాత దిశ యాప్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఆపదలో ఉన్న ఆడవారికి నిజంగా దిశ యాప్ తోబుట్టువనే అంటున్నారు చీరాల ప్రాంత వాసులు.
Also Read: భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్... వైద్య, ఆరోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి ఆమోదం
Also Read: ఒకటే ఫోటో .. కేటీఆర్, విజయసాయిరెడ్డి ప్రచారం ! ఇంతకీ ఎవరిది ఫేక్ ?
Also Read: కేశినేని రాజకీయ వైరాగ్యం.. ఇక పోటీకి దూరం !