ఆత్మకూరు నియోజకవగర్గం జడ్పీటీసీల పోరులో వైసీపీ జైత్రయాత్ర కొనసాగిందని అన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఎంపీటీసీ స్థానాల్లో భారీ మెజారిటీ వచ్చిందని చెప్పారు. పరిషత్ ఎన్నికలలో వార్ వన్ సైడ్ గా మారిందని అన్నారు. గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తమపై మరోసారి నమ్మకముంచారని, మరింత బాధ్యత పెంచారని అన్నారు. 
పరిషత్ ఎన్నికలలో విజయం అందించిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలలోనైనా ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తుందన్నారు. అందుకు పరిషత్ ఫలితాలు నిదర్శనమన్నారు. నెల్లూరు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తన నియోజకవర్గంలోని 6 మండలాలలో విజయం సాధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఆయన అభినందించారు. పార్టీ కండువా కప్పుతూ ప్రజల రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 జడ్పీటీసీ స్థానాలలో వైసీపీ జెండా ఎగురడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిషత్తు ఎన్నికలలో వైసీపీ 98శాతం స్థానాలను కైవసం చేసుకోవడం ముఖ్యమంత్రి నాయకత్వంపట్ల ప్రజలకున్న విశ్వసనీయతకు మరో ఉదాహరణగా నిలిచిందన్నారు.


అప్పారావుపాలెంలో ఒకే ఇంట్లో అత్త ఎంపీటీసీ , కోడలు జడ్పీటీసీగా ఎంపికవగా మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, రాజకీయాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని  అత్త పెమ్మసాని వేణమ్మ, కోడలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మిలకు మంత్రి మేకపాటి ఆల్ ది బెస్ట్ చెప్పారు.


ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు నాకు ఆరు ప్రాణాలు 


అనంతసాగరం మండలంలో వార్ వన్ సైడ్ అవడం పట్ల ఆ మండల కన్వీనర్ రాపూరి వెంకట సుబ్బారెడ్డిని మంత్రి మేకపాటి ప్రత్యేకంగా అభినందించారు. 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీతో క్లీన్ స్వీప్ చేయడం పట్ల మంత్రి మేకపాటి ఆ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక ఏకగ్రీవాలు, అన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానంలో విజయబావుటా ఎగురవేశామన్నారు. చేజర్లలోనూ  విజయఢంకా మోగించినందుకు మంత్రి ఆ మండల నాయకులను , ప్రజలను అభినందించారు. మొత్తం 10 స్థానాల్లో 7 ఏకగ్రీవం సహా, మిగతా 3 చోట్లా విజయం అందించిన ఆ మండల ప్రజలకు మంత్రి మేకపాటి ధన్యవాదాలు తెలిపారు.


మండలాల వారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సమావేశం.. 


 సంగం మండలంలో 13 ఎంపీటీసీలకు గానూ, 4 ఏకగ్రీవ విజయాలతో పాటు,  మొత్తం 12 స్థానాల్లో ప్రభంజన విజయం సాధించామని ఆ మండలానికి చెందిన కన్వీనర్ రఘు సహా ఎంపీటీసీ అభ్యర్థులతో మంత్రి మాట్లాడారు. ప్రజల అభిమానం సంపాదించుకున్న ప్రతి ఒక్కరూ ప్రజా సేవలో ముందుండాలన్నారు.
మర్రిపాడులో  మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలలో 12, ఏ.ఎస్ పేట మండలంలోని మొత్తం 10 స్థానాల్లో 9, ఆత్మకూరులో మొత్తం 9 స్థానాలకు గానూ 6 చోట్ల వైసీపీకి చెందిన ఎంపీటీసీలు గెలుపొందారని, ఈ సందర్భంగా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.


ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలలో 27 చోట్ల ఏకగ్రీవ విజయం సాధించామని, ఎన్నికల ఫలితాలతో కలిపి 61 చోట్ల విజయబావుటా ఎగురవేసినట్లు మంత్రి మేకపాటి తెలిపారు. ప్రజలతో మమేకమై..ప్రజా సేవ చేసి భవిష్యత్ లో ఏ ఎన్నిక జరిగినా ఇలాగే ఏకపక్ష గెలుపు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.


నెలరోజులు నెల్లూరుకి దూరంగా ఉన్నా.. మంత్రి అనిల్ భావోద్వేగం.. 


రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరానికి ఇన్ని రోజులు దూరంగా ఎప్పుడూ ఉండలేదని మంత్రి అనిల్ భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో నెల్లూరు నగరానికి నెలరోజులపాటు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. తిరిగి దేవుడి కార్యక్రమంతో నెల్లూరు ప్రజల ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారాయన. 


నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ పాలక మండలి ఛైర్మైన్ గా ఇలపాక శివకుమార్ ఆచారి, సభ్యులు... మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ కు, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనుల్ని పరిశీలించారు. 


నెలరోజులుగా అనారోగ్య కారణాలతో నెల్లూరుకి దూరంగా ఉన్నానని, దేవుడి కార్యంతో ఇప్పుడు ప్రజల ముందుకొచ్చానని, ఇకపై ప్రజల్లోనే ఎక్కువ రోజులు ఉంటానని చెప్పారు మంత్రి అనిల్. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రజాహక్కు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. నెల్లూరు నగరాభివృద్ధికి కొత్త ప్రణాళికను పట్టాలెక్కిస్తున్నట్టు స్పష్టం చేశారు. నెలరోజుల్లో నెల్లూరులో 300కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలుస్తున్నట్టు ప్రకటించారు అనిల్. 


ఇటీవల నెలరోజులుగా మంత్రి నెల్లూరుకి దూరంగానే ఉండటంతోపాటు, అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొనలేకపోయారు. ఇప్పుడు తిరిగి రాజకీయాల్లో బిజీగా మారారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వేళ.. టీడీపీ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరించలేదని, ప్రజలంతా వైసీపీవైపే ఉన్నారని బదులిచ్చారు. ఇప్పుడిక పూర్తి స్థాయిలో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.


ALSO READ: మన అరకులోని ఫొటోలేగానీ.. ఈ ముగ్గురు మహిళా ఎంపీలు ఎవరో గుర్తు పట్టారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి