అంతా కొత్తవాళ్లే.. అప్పుడే కెప్టెన్సీ అందుకున్న జులపాల కుర్రాడు.. సచిన్, ద్రవిడ్, గంగూలీ వంటి దిగ్గజాలే లేరు. అయినప్పటికీ టీమ్‌ఇండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచేసింది. అఖండ భారతావనికి ఆనందం కలిగించింది. పైగా దాయాది పాకిస్థాన్‌పై ఉత్కంఠకర విజయం సాధించడం గమనార్హం. మరి ఆ అద్భుతం జరిగి నేటికి (సెప్టెంబర్ 24) పదమూడేళ్లు.
Also Read: IPL 2021, CSK vs RCB: ధోనీ నా కెప్టెన్! మరి సీఎస్‌కేతో మ్యాచులో కోహ్లీసేన వ్యూహాలేంటి?
భారత క్రికెట్ చరిత్రలో అరంగేట్రం ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఓ అద్భుతం. ఎందుకంటే కుర్రాళ్లే వెళ్లి కప్పు కొట్టుకొచ్చారు! పైగా జట్టుకు ప్రత్యేకంగా కోచ్ సైతం లేరు. లాల్‌చంద్ రాజ్‌పుత్ మేనేజర్‌గా వారితో వెళ్లారు. ప్రత్యేక వ్యూహాలేమీ లేవు. అంతకుముందే సీనియర్లతో కూడిన జట్టు వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేయడంతో అస్సలు అంచనాలే లేవు. అలాంటిది ధోనీసేన ఏకంగా ప్రపంచకప్పే గెలిచేసింది.
కెప్టెన్ ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పోరులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ బాదిన ఆరు సిక్సర్లు సంచలనంగా మారింది. అంతేకాకుండా టోర్నీ సాంతం అతడు సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. గౌతమ్ గంభీర్ కెరీర్లోనే అత్యంత విలువైన ఇన్నింగ్సులు ఆడాడు. ఫైనల్లో అతనాడిన ఇన్నింగ్స్‌ను ఎంత పొగిడినా తక్కువే.
పాక్‌తో జరిగిన ఫైనల్లో మొదట భారత్ 157/5 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చాడు. కేవలం 54 బంతుల్లో 8 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక పాకిస్థాన్ దాదాపు ఈ లక్ష్యాన్ని ఛేదించినంత పనిచేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మిస్బా ఉల్ హఖ్ (43) ఆఖరి వరకు ఆడాడు. ఆఖరి ఓవర్లో జోగిందర్ వేసిన మరో మూడో బంతికి మిస్బా ఇచ్చిన క్యాచ్‌ను శ్రీశాంత్ అందుకోవడంతో భారత్ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి