ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్లు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ప్రారంభం బాగానే ఉన్నప్పటికీ ఆఖరిలో మిడిలార్డర్ చేతులెత్తేయడంతో 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33: 30 బంతుల్లో: నాలుగు ఫోర్లు), క్వింటన్ డికాక్ (54: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) మినహా మిగతా వారెవరూ సరిగ్గా ఆడలేదు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా వెంకటేష్ అయ్యర్(53: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి(74: 42 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు) రెండో వికెట్‌కు 88 పరుగులు చేసి విజయాన్ని సులభం చేశారు. ఈ ఓటమితో ముంబై పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోవడంతో పాటు ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
Also Read: Rohit Sharma Record: ఐపీఎల్ లో రోహిత్ రికార్డు... ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ఘనత
ఆరంభం ఘనంగా.. ముగింపు పేలవంగా..
ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (33: 30 బంతుల్లో: నాలుగు ఫోర్లు), క్వింటన్ డికాక్ (54: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) మొదటి వికెట్‌కు పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్నిచ్చారు. పవర్‌ప్లేలో మొదటి నాలుగు ఓవర్లు స్పిన్నర్లు వేయడంతో కాస్త ఇబ్బంది పడినా.. చివరి రెండు ఓవర్లలో పేసర్ల బౌలింగ్‌లో పరుగులు పిండుకున్నారు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు 56-0గా నిలిచింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో వీరు కాస్త ఇబ్బంది పడినా.. పేస్ బౌలర్లను మాత్రం ఒక ఆటాడుకున్నారు. అయితే పదో ఓవర్లో రోహిత్‌ను అవుట్ చేసి సునీల్ నరైన్ కోల్‌కతాకు మొదటి బ్రేక్ ఇచ్చాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(5: 10 బంతుల్లో) ఎక్కువ సేపు నిలబడలేదు. తనని ప్రసీద్ కృష్ణ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లలో క్వింటన్ డికాక్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ పూర్తి అయిన కాసేపటికే ప్రసీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. అనంతరం ఇషాన్ కిషన్‌ను (14: 13 బంతుల్లో, ఒక సిక్సర్) లోకి ఫెర్గూసన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా కోల్‌కతా బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హార్డ్ హిట్టర్లు అయిన పొలార్డ్ (21: 15 బంతుల్లో, 2 ఫోర్లు, ఒక సిక్సర్), కృనాల్ పాండ్యా (12: 9 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా స్కోర్ చేయలేకపోయారు. చివరి రెండు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఒక దశలో సులువుగా 180 పరుగుల చేస్తారనుకున్న ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసీద్, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీసుకోగా, సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.
Also Read: ICC T20 World Cup Anthem: టీ20 ప్రపంచకప్ థీమ్ సాంగ్ చూస్తారా? అద్దిరిపోయింది!
అదిరిపోయే ఆరంభం
ఛేదనలో కోల్‌కతాకు అదిరిపోయే ఆరంభం లభించింది. మొదటి మూడు ఓవర్లలోనే శుభ్‌మన్ గిల్ (13: 9 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), వెంకటేష్ అయ్యర్‌లు 40 పరుగులు రాబట్టారు. మూడో ఓవర్ ఆఖరి బంతికి గిల్‌ను అవుట్ చేసి బుమ్రా ముంబైకి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా అటాకింగ్ గేమ్ ఆడటంతో స్కోరు వేగం ఎక్కడా మందగించలేదు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా ఒక వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసింది. వీరు ఓవర్‌కు పది పరుగులు తగ్గకుండా చేయడంతో పాటు వికెట్లు కూడా ఇవ్వకపోవడంతో 10 ఓవర్లకే వికెట్ నష్టానికే 111 పరుగులు కోల్‌కతా చేసింది.
అనంతరం ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్, 12వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి అర్థ సెంచరీలు సాధించారు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో వెంకటేష్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా రాహుల్ త్రిపాఠి ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేయడంతో సహకారం అందించడంతో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయానికి ముంగిట మోర్గాన్(7: 8 బంతుల్లో, ఒక సిక్సర్) అవుటయినా.. నితీష్ రాణాతో కలిసి రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ముంబై బౌలర్లందరూ సమిష్టిగా విఫలం అయ్యారు. బుమ్రా రెండు వికెట్లు తీసినప్పటికీ పరుగులు మాత్రం ధారాళంగానే సమర్పించుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో పది ఓవర్లు మిగిలుండగానే గెలవడం.. ఈ మ్యాచ్‌లో కూడా 4.5 ఓవర్లు మిగలగానే గెలవడంతో కోల్‌కతా నెట్‌రన్‌రేట్‌ను మెరుగు పరుచుకోవడంతో పాటు.. పాయింట్ల పట్టికలో టాప్-4కి దూసుకెళ్లింది.
Also Read: IPL 2021: దేవుడిచ్చిన ప్రతిభను వృథా చేస్తున్నాడు: సంజు శాంసన్‌పై సన్నీ ఆగ్రహం