యువ ఆటగాడు సంజు శాంసన్ దేవుడిచ్చిన ప్రతిభను వృథా చేస్తున్నాడని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీజులోకి రాగానే సిక్సర్లు బాదేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉంటే తప్ప అలా చేయలేరని, అంతర్జాతీయ క్రికెట్లోనూ అతడిలాగే అవకాశాలు వృథా చేసుకున్నాడని వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచులో అతడి ప్రదర్శనపై సన్నీ మాట్లాడాడు.
'సంజు విఫలమవ్వడానికి కారణం అతడి షాట్ల ఎంపికే. అంతర్జాతీయ మ్యాచుల్లోనూ అతడంతే. పైగా అతడేమీ ఓపెనింగ్ చేయడు. రెండు, మూడో డౌన్లో వస్తుంటాడు. రాగానే మొదటి బంతినే సిక్సర్‌గా బాదాలనుకుంటాడు. అది సాధ్యం కాదు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నవారూ అలా కొట్టలేరు. క్రీజులో నిలబడేందుకు, పరిస్థితులు అర్థం చేసుకొనేందుకు సింగిల్స్, డబుల్స్ తీస్తుండాలి. అప్పుడే ఫుట్‌వర్క్ కాస్త మెరుగవుతుంది' అని గావస్కర్ అన్నాడు.
Also Read: IPL 2021: రిషభ్ పంత్.. ఆధునిక క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్! సందేహం లేదన్న మంజ్రేకర్
'శాంసన్ ఇవన్నీ చూసుకోవాలి. లేదంటే దేవుడిచ్చిన ప్రతిభ వృథా అవుతుంది. టెంపర్‌మెంట్ నుంచి షాట్ల ఎంపిక వరకు అతడు మెరుగవ్వాలి. ఇవే కదా కుర్రాళ్లను, సీనియర్లను వేరు చేసేది. పైగా అతడు టీమ్‌ఇండియాకు క్రమం తప్పకుండా ఆడాలంటే షాట్ సెలక్షన్ మరింత మెరుగు పర్చుకోవాలి' అని సన్నీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ రెండో దశలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో రాజస్థాన్ ఉత్కంఠర విజయం అందుకుంది. 185 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ చెలరేగి ఆడినా.. ఆఖరి ఓవర్లో వారిని అడ్డుకొని విజయం అందుకుంది. కాగా ఈ మ్యాచులో సంజు కేవలం 4 పరుగులే చేశాడు. భారీ సిక్సర్లు బాదుతూ సెంచరీలు కొట్టగల అతడు షాట్ల ఎంపికలో లోపాలతో నిలకడ సాధించడం లేదు. దీనిపైనే సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా తర్వాతి పోరుకోసం రాజస్థాన్ సాధన చేస్తోంది. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి