కోలీవుడ్ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో, సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపారవేత్తకు నకిలీ పత్రాలు చూపించి ఏకంగా రూ.15 కోట్లు చీట్ చేసినట్లు తెలుస్తోంది.

    


ఇంతకీ చంద్రశేఖరన్ చీటింగ్ కేసు కథ ఏంటంటే?


ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఘనవ్యర్థాలు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌ పెడితే భారీగా లాభాలు వస్తాయని చెన్నైకి చెందిన బాలాజీ అనే ఓ వ్యాపారవేత్తను చంద్రశేఖరన్ నమ్మించారు. కలిసి ప్రాజెక్టు ఏర్పాటు చేద్దామని ఒప్పించారు. ఆయనను నమ్మి సదరు వ్యాపారవేత్త  ఒప్పందం కుదుర్చుకున్నారు. 2020 సెప్టెండర్ 17న ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా పెట్టుబడి కోసం రూ. 15.83 కోట్లు ఇచ్చారు. డబ్బులు తీసుకున్న చంద్రశేఖరన్ ఇప్పటి వరకు ప్రాజెక్టును మొదలు పెట్టలేదు. ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందంటే? చూద్దాం, చేద్దాం అంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రాజెక్టు వద్దు, ఏం వద్దు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని సదరు వ్యాపారవేత్త కోరాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వకపోవడంతో బాలాజీ తాజాగా సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే, వ్యాపారవేత్త నుంచి డబ్బులు రాబట్టేందుకు చంద్రశేఖరన్ నకిలీ డాక్యుమెంట్లు చూపించినట్లు ఈ దర్యాప్తులో వెల్లడి అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు చంద్రశేఖరన్ కు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.    


ఇంతకీ రవీందర్ చంద్రశేఖరన్ ఎవరంటే?


రవీందర్ చంద్రశేఖరన్ తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ నిర్మాతగా కొనసాగుతున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు.  గత ఏడాది టీవీ నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. తనకంటే వయసులో 20 ఏళ్లు తక్కువగా ఉన్న అమ్మాయిని చేసుకున్నారు. అంతేకాదు, చంద్రశేఖరన్ చాలా లావుగా ఉండటం, తను చాలా చిన్నఅమ్మాయి కావడంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. ఇటీవల తన భార్య మహాలక్ష్మితో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సిరీని జరుపుకున్నాడు. అయితే, రీసెంట్ గా వాళ్లిద్దరు విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ఫన్నీ ఎమోజీ పెట్టి ఆ వార్తలు అవాస్తవం అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, రవీందర్ చంద్రశేఖరన్ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు వివాదాల్లో ఇరుక్కున్నాడు. పలుమార్లు కేసులు కూడా నమోదు అయ్యాయి.






Read Also: సౌత్ బాటపడుతున్న బాలీవుడ్ స్టార్స్, విజయ్ దళపతి మూవీలో విలన్‌గా అమీర్ ఖాన్?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial