India-Bharat Name Row: 


యూరప్ పర్యటనలో రాహుల్ 


యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇండియా పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి I.N.D.I.A అనే పేరు పెట్టడం వల్లే బీజేపీ భారత్‌ అనే పేరు పెట్టాలనుకుంటోందని విమర్శించారు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కి ఇదే నిదర్శనమని మండి పడ్డారు రాహుల్. ఇండియా అంటేనే భారత్ అని, మళ్లీ పేరు మార్చాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ప్రభుత్వం భయపడుతోందనడానికి, ఈ పేరు మార్పు రాజకీయాలే ఉదాహరణ అని అన్నారు. 


"ఇండియా అంటే భారత్. ఈ పేరు బాగానే ఉంది. ఇదే మనమేంటో ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ మోదీ ప్రభుత్వానికి ఎక్కడో ఓ భయం పట్టుకుంది. మేం I.N.D.I.A అని పేరు పెట్టుకోగానే వెంటనే దేశం పేరు మార్చాలని ప్రతిపాదించింది. కేవలం భయంతో వచ్చిన ప్రతిపాదనే ఇది. ఇవి డైవర్షన్ పాలిటిక్స్. అదానీ వ్యవహారం గురించి మేం మాట్లాడిన ప్రతిసారీ వేరే కొత్త టాపిక్‌ తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ


బీజేపీ అజెండా అదే..


దేశ భవిష్యత్‌ని నాశనం చేయడమే బీజేపీ అజెండా అని విమర్శించారు రాహుల్ గాంధీ. అధికారం అంతా వాళ్ల చేతుల్లోనే ఉండాలనుకుంటోందని ఫైర్ అయ్యారు. 


"బీజేపీ విజన్ అంతా వేరుగా ఉంది. అధికారం అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉండాలని భావిస్తోంది. అది కూడా వాళ్ల చేతుల్లోనే ఉండాలనుకుంటోంది. ప్రజలు ప్రభుత్వం గురించి మాట్లాడుకునే అవకాశమే లేకుండా చేస్తోంది. మహాత్మా గాంధీ విజన్‌కి, గాడ్‌సే విజన్‌కి మధ్య జరుగుతున్న యుద్ధమిది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ 


భారత్ G20కి అధ్యక్షత వహించడంపైనా రాహుల్ స్పందించారు. ఇది చాలా గొప్ప విషయమే అని, అయితే దేశంలోని సమస్యల్ని ప్రస్తావిస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. 


"G20 సమ్మిట్‌ భారత్‌లో జరుగుతుండడం, మనం ఇలా ఆతిథ్యం ఇవ్వడం చాలా మంచి విషయం. కానీ అంతర్గతంగా చాలా సమస్యలున్నాయి. వాటి గురించి మేం చాలా సార్లు మాట్లాడాం. వాటి గురించి కేంద్రం పట్టించుకోకుండా అలా వదిలేయడమే సరికాదు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ