ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరే కరెక్ట్ అని మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. భారత్ ప్రదర్శించిన వైఖరిని సరైనదే అని ఆయన మోదీని సమర్థించారు. దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి సరైన విధంగా స్పందిచారని, మీరు చేసిందే కరెక్ట్ అని అన్నారు. అదే సమయంలో శాంతి స్థాపన కోసం విజ్ఞప్తి చేయడాన్ని కూడా ఆయన సమర్థించారు. మన్మోహన్ సింగ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జీ 20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. శనివారం జరిగే జీ 20 విందుకు మన్మోహన్‌కు కూడా ఆహ్వానం అందింది.
ప్రస్తుతం దేశీయ రాజకీయాలకు కూడా విదేశీ పాలసీల ప్రాముఖ్యత చాలా పెరిగిందని, తన హయాంలో ఇలా లేదని మన్మోహన్ పేర్కొన్నారు. అయితే పార్టీ రాజకీయాల కోసం దౌత్య పరమైన అంశాలను ఉపయోగించుకోవడంలో సంయమనం పాటించాలని అన్నారు. భారత్ జీ 20 సదస్సుకు అధ్యక్షత వహించడం పట్ల మన్మోహన్ సంతోషం వ్యక్తంచేశారు. తన జీవిత కాలంలో భారత్‌కు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జీ 20 నేతలకు భారత్ ఆతిథ్యమివ్వడాన్ని తాను చూస్తున్నానని అని సంతోషం వ్యక్తంచేశారు.
అలాగే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడుతూ భారత్ ఈ అంశాన్ని డీల్ చేసిన విధానం కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఏదో ఒక దానికి మద్దతుగా నిలవడం ఇతర దేశాలకు కష్టమైన విషయమని అన్నారు. ఈ విషయంలో దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ భారత్ ఎంచుకున్న వైఖరి సరైనదని మన్మోహన్ పేర్కొన్నారు. అయితే జీ 20 సదస్సులో పలు దేశాలు భద్రతపరమైన విభేదాలను పక్కన పెట్టి వాతావరణ మార్పులు, అసమానతలు, అంతర్జాతీయ వాణిజ్యంలో విశ్వాసం కలిగేలా ఈ వేదికపై చర్చల విషయంలో దృష్టి పెట్టడం ముఖ్యమంని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతా పరమైన విభేదాలను పరిష్కరించే వేదికగా జీ20ని ఎన్నడూ పరిగణించలేదని అన్నారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సదస్సుకు హాజరుకాకపోవడంపైనా మన్మోహన్ స్పదించారు. భారతదేశ ప్రాదేశికత, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని, ప్రభుత్వానికి సలహా ఇవ్వడాన్ని తాను ఇష్టపడడం లేదని అన్నారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రి తాను సలహా ఇవ్వడం సరికాదని అన్నారు. అలాగే భవిష్యత్తు సవాళ్లపై ప్రశ్నించగా.. తాను రాబోయే సవాళ్ల విషయంలో ఆందోళన చెందడం కంటే ఆశాజనకంగా ఉన్నానని, భారత దేశం సామరస్యపూర్వకమైన సమాజంగా ఉండాలనేది తన ఆశ అని పేర్కొన్నారు. ఇదే పురోగతికి, అభివృద్ధికి పునాది అని తెలిపారు. వైవిధ్యాన్ని స్వాగతించడమే భారతదేశం సహజ స్వభావమని, దీన్ని కాపాడుకోవాలని అన్నారు.
ఇస్రో చంద్రయాన్ 3ను విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయడంపై మన్మోహన్ సింగ్ ఇస్రోను అభినందించారు. భారతదేశం సాంకేతిక పరిజ్ఙానం అత్యుత్తమమైనదని ప్రపంచంలో రుజువు అవ్వడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు.