Sanatan Dharma Row: 



స్టాలిన్ వ్యాఖ్యలపై పరోక్ష విమర్శలు..


సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగలేదు. ఇప్పటికే బీజేపీ కీలక నేతలు ఈ వివాదంపై స్పందించగా...యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్రంగానే స్పందించారు. గతంలోనూ చాలా సార్లు కొంతమంది సనాతన ధర్మంపై దాడి చేశారని, కానీ ఏమీ చేయలేకపోయారని స్పష్టం చేశారు. అధికారం కోసం దిగజారిపోతున్న వాళ్లు ఇప్పుడు దాడి చేయడం మొదలు పెట్టారని మండి పడ్డారు. రావణుడు, కంసుడు లాంటి రాక్షసులే సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారని తేల్చి చెప్పారు. 


"రావణుడి గర్వం సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయింది. కంసుడు కూడా ఈ ధర్మాన్ని అంతం చేయాలని చూశాడు. ఆయన వల్లా కాలేదు. ఆ తరవాత బాబర్, ఔరంగజేబ్‌ సనాతనాన్ని తుడిచి పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంత బలమై ధర్మాన్ని అధికారం కోసం దిగజారిపోతున్న ఈ పరాన్న జీవులు (విపక్షాలు ) ఏం చేయగలవు" 


- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి 






శక్తికి మూలం..


శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇలా ఫైర్ అయ్యారు. ఉదయనిధి స్టాలిన్ పేరు ఎత్తకుండానే గట్టిగానే బదులిచ్చారు. సనాతన ధర్మం ఈ సృష్టిలోని శక్తికి మూలం అని, ఇది సూర్యుడిలాంటిదని తేల్చి చెప్పారు. 


"పనికిమాలిన వాళ్లు మాత్రమే సూర్యుడిపై ఉమ్మివేయాలని చూస్తారు. అలాంటి పిచ్చి పని చేస్తే అది తిరిగొచ్చి మళ్లీ వాళ్ల ముఖంపైనే పడుతుంది. దేవుడిని కించపరచాలని చూసిన ప్రతి ఒక్కరూ అంతమైపోయారు. 500 ఏళ్ల క్రితం కూడా సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఇదంతా చూసి ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నారు. దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ అది వాళ్ల తరం కాదు. రావణుడు, హిరణ్యకశ్యపుడు, కంసుడు ఇలా చాలా మంది సనాతనాన్ని అణిచివేయాలని ప్రయత్నించారు. అలా ప్రయత్నించి వాళ్లే అంతమైపోయారు"


- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి 


సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో తన కొడుకునే సమర్థించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్. ఉదయనిధి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వాటిని తప్పుదోవ పట్టించారని తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రధాని సహా మంత్రులందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన సమయంలో "నరమేధం" అనే పదమే అనలేదని వివరించారు. ఇంగ్లీష్‌లో కానీ, తమిళ్‌లో కానీ ఆ పదాన్ని పలకలేదని అన్నారు. ఉదయనిధిపై కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. 


"కొందరు బీజేపీ మద్దతుదారులు ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల్ని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నరమేధం సృష్టించాలని చూస్తున్నారంటూ విద్వేషాలు పెంచుతున్నారు. బీజేపీ చేతుల్లోని సోషల్ మీడియా ఈ ప్రచారం చేస్తోంది. కానీ...ఉదయనిధి తన స్పీచ్‌లో ఎక్కడా నరమేధం అనే పదమే వాడలేదు. అయినా...అదే పదేపదే ప్రచారం చేస్తున్నారు"


- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి 


  Also Read: భారత్ డిజిటల్ ఇన్‌ఫ్రా అద్భుతం, 47 ఏళ్ల లక్ష్యాన్ని ఆరేళ్లలోనే సాధించింది - ప్రపంచ బ్యాంక్ కితాబు