అందరూ ఊహించిందే జరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ దెబ్బతినడంతో...బీజేపీతో పొత్తుకు రెడీ అయింది. బీజేపీ, జేడీఎస్ పొత్తు కుదుర్చుకుంటాయని కొన్నినెలలుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను...మాజీ ప్రధాని దేవేగౌడ పలు సార్లు సమర్థించారు. మోడీకి బాసటగా నిలిచారు.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాను.. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ కలిశారు. రెండు పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. 2023 లోక్‌సభ ఎన్నికల్లో 5 స్థానాలు కేటాయించాలనే ప్రతిపాదనను...బీజేపీ ముందు పెట్టారు దేవేగౌడ. దీనికి జేపీ నడ్డా, అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీనే తీసుకుంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను...కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటు దక్కించుకున్నాయి. హసన్ స్థానం నుంచి దేవగౌడ మనవడు, మాజీ మంత్రి రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్ ఎన్నిక ప్రక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఆయన ఎన్నికను రద్దు చేసింది కర్ణాటక హైకోర్టు.
దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలుపుతున్నామని జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి...ఇటీవలే ప్రకటించారు. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి బీజేపీతో జట్టుకట్టడంపై ప్రకటన చేశారు. కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాయని.. అందుకే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ ఘోర పరాభవం పొందాయ్. లోక్‌సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది బీజేపీ.