IIT Mandi:  అతను బాగా చదువుకున్న వ్యక్తి. పైగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ వరదలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మాంసాహారం తినడం వల్లే హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. జంతువులను చంపడానికి, వరదలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.


హిమాచల్‌ ప్రదేశ్‌లో కురిసిన కుండపోతవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడానికి కారణం మాంసం కోసం జంతువులను చంపడమేనని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా అన్నారు. ఈ కారణంగా పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  


ఓ ఆడిటోరియంలో విద్యార్థుల బృందాన్ని ఉద్దేశించి లక్ష్మీధర్ బెహెరా మాట్లాడుతూ మంచి మనిషిగా మారడానికి మాంసం తినకుండా ఉండాలని చెప్పారు. ప్రసంగంలో మంచి మనుషులుగా మారడానికి ఏం చేయాలని బెహెరాను కొందరు విద్యార్థులు అడిగారు. ఇందుకు మాంసం తినడం మానేయాలని బెహెరా చెప్పారు. రాష్ట్రంలో విపత్తులు జంతువులను చంపడం వల్ల పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుందని, ఫలితంగా వరదలు వస్తున్నాయని అన్నారు. విద్యార్థుల చేత మాంసం తినడం మానేసేలా జపించాలని కోరారు. 


అమాయక జంతువులను చంపితే హిమాచల్ ప్రదేశ్ గణనీయమైన పతనానికి గురవుతుందని బెహెరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మాత్రం క్లారిటీ లేదు. మాంసం తినడానికి అతి వర్షాలకు సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ఆయన్ను సంప్రదించేందుకు ఫోన్‌లో యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. బెహరా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో తన స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోంచి దుష్టశక్తులను పారదోలేందుకు భూతవైద్యంలో పాల్గొన్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించి వార్తల్లో నిలిచారు. 


బెహెరా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తారు. ఈ వివాదంపై బెహరా నుంచి ఎలాంటి స్పందన లేదు. పారిశ్రామికవేత్త, IIT ఢిల్లీ పూర్వ విద్యార్థి సందీప్ మనుధనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో మాట్లాడుతూ.. ‘70 ఏళ్లలో ఏది కట్టినా ఇలాంటి మూఢ మూర్ఖులు దాన్ని నాశనం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. ప్రొఫెసర్ బెహెరా ఇలాంటి ప్రకటన చాలా బాధాకరమని బయోఫిజిక్స్ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ అన్నారు.  


దీనిపై జియాలజిస్ట్, స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ (CUHP) డీన్ ఆంబ్రీష్ కుమార్ మహాజన్ మాట్లాడుతూ.. ఇటీవల విపత్తులు భౌగోళిక కారణాలతో పాటు మానవజన్య కారణాలతో సంభవించాయని అన్నారు. ప్రపంచంలో చాలా మంది చాలా చెబుతుంటారని అలాంటి వాటిపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. అయితే, హిమాచల్‌లో విపత్తులు మాత్రం భౌగోళిక, మానవజన్య కార్యకలాపాల కారణంగా సంభవించాయని అన్నారు. ప్రమాదకరమైన వాతావరణం, ప్రణాళిక లేని నిర్మాణాల కారణంగా రాష్ట్రంలో ఇటీవలి కొండచరియలు విరిగిపడటానికి కారణమని చాలా మంది నిపుణులు పేర్కొన్నారు.