Rishi Sunak: 


 
ఢిల్లీకి రిషి సునాక్..


G20 సదస్సుకి హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకున్నారు యూకే ప్రధాని రిషి సునాక్. సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఇండియాకి రావడం చాలా సంతోషంగా ఉందని, భారత్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు రిషి సునాక్. తనని ఇండియా అల్లుడిగా పిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటన తనకెంతో ప్రత్యేకం అని వెల్లడించారు. మూడు రోజుల పాటు భారత్‌లోనే ఉండనున్నారు సునాక్. ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు రిషి సునాక్. 


"ఇండియా పర్యటన నాకెంతో స్పెషల్. నన్ను ఇండియా అల్లుడిగా పిలవడం చాలా సంతోషం. ఎంతో ఆత్మీయమైన పిలుపు అది. భారత్ అంటే నాకు చాలా ఇష్టం"


- రిషి సునాక్, యూకే ప్రధాని 


రష్యా ఉక్రెయిన్‌పై చర్చ


G20 సమ్మిట్‌లో ఏమేం చర్చించాలో ముందుగానే నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు రిషి సునాక్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించీ ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారంలో భారత్ పాత్ర అత్యంత కీలకమనీ తేల్చి చెప్పింది. 


"G20 సదస్సులో ఏమేం మాట్లాడాలో ముందుగానే నిర్ణయించుకున్నాను. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థని స్థిరీకరించాలి. అంతర్జాతీయ సంబంధాలనూ మెరుగు పరచాలి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించాలన్నదీ మా ప్రధాన అజెండా. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడంలో భారత్ పాత్ర అత్యంత కీలకం"


- రిషి సునాక్, యూకే ప్రధాని 




పుతిన్‌పై విమర్శలు..


రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ముఖం చూపించుకోలేకే G20 సదస్సుకి రావడం లేదని మండి పడ్డారు రిషి సునాక్. కావాలనే ఈ సమ్మిట్‌కి దూరంగా ఉన్నారని, విమర్శలు వస్తాయని ఆయనకీ తెలుసని అన్నారు. 


"రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ముఖం చూపించుకోలేకనే G20 సదస్సుకి రావడం లేదు. కావాలనే అందరికీ దూరంగా ఉంటున్నారు. విమర్శలు ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదు. ఈ సదస్సులో పాల్గొనే దేశాలు కచ్చితంగా రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చిస్తాయి. సమస్య పరిష్కారానికి యూకే అన్ని విధాలుగా సహకరిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్‌ కీలక పాత్ర పోషించనుంది. త్వరలోనే ఈ సైనిక చర్య ముగిసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది"


- రిషి సునాక్, యూకే ప్రధాని