గత కొద్ది కాలం బాలీవుడ్ సినిమాలతో పోల్చితే సౌత్ సినిమాలు అద్భుత విజయాలను అందుకుంటున్నాయి. వసూళ్ల పరంగా దుమ్మురేపుతున్నాయి. అవార్డుల విషయంలోనూ నార్త్ ను బీట్ చేస్తున్నాయి. రోజు రోజుకు సౌత్ సినిమా పరిశ్రమ బాలీవుడ్ ను డామినేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు మొగ్గుచూపుతున్నారు.
విలన్ పాత్రల్లో అదరగొడుతున్న బాలీవుడ్ స్టార్స్
ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. విలన్ క్యారెక్ట్స్ కూడా చేస్తున్నారు. కన్నడ సినిమా పరిశ్రమలో తెరకెక్కిన సంచలన విజయాన్ని అందుకున్న ‘కేజీఎఫ్2’లో సంజయ్ దత్ విలన్ రోల్ పోషించారు. అటు నటుడు వివేక్ ఒబెరాయ్ తమిళ చిత్రం ‘వివేగం’లో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. సీనియర్ నటుడు జాకీష్రాఫ్ సైతం పలు సౌత్ సినిమాల్లో నటించారు.
విజయ్ మూవీలో విలన్ గా అమీర్ ఖాన్!
తాజాగా మరో ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ‘లియో’ మూవీలో నటిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, ఈ చిత్రం తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విలన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు అమీర్ కూడా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజం అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం. త్వరలో ఈ రెండు అంశాలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ప్రస్తుతం దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జ్యోతిక మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక విలన్ పాత్రలో ఎస్‌జే సూర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
‘లియో’లో విజయ్ తండ్రిగా సంజయ్ దత్
మరోవైపు లోకేష్ కనగరాజ్ తో కలిసి విజయ్ ‘లియో’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్ కనిపించనున్నారు. ‘లియో’ సినిమాలో విజయ్ దళపతి తండ్రిగా సంజయ్ దత్ కనిపించనున్నారు. ఇందులో తండ్రీ కొడుకులు ఇద్దరూ గ్యాంగ్ స్టర్స్ గా నటించనున్నారు. సూపర్ డూపర్ యాక్షన్ సీక్వెన్స్ తో వీరిద్దరు అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది. ‘లియో’ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: ‘పుష్ప2‘ షూటింగ్ స్పాట్ ఫోటోను షేర్ చేసిన శ్రీవల్లి - అదుర్స్ అంటున్న నెటిజన్లు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial