Imported Coal: దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. అయితే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జలాశయాలు ఆశించిన మేర నిండుకోలేవు. దీని వల్ల జల విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్ ను తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి కోసం చాలా రాష్ట్రాల్లోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బొగ్గు ఆధారిత కరెంట్ పై దృష్టి పెట్టాయి. అయితే డిమాండ్ కు తగ్గ విద్యుత్ ఉత్పత్తిని అందుకోవడానికి అవసరమైన బొగ్గు నిల్వలు లేనందు వల్ల కేంద్రం ఈ సమస్యపై ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది మార్చి నెల వరకు 4 శాతం విదేశీ బొగ్గును ఉపయోగించాలని రాష్ట్రాలకు కేంద్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ ఉత్పత్తి సంస్థల సీఎండీలకు లేఖ రాసింది. 


ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 6 శాతం విదేశీ బొగ్గును కలపాలని ఇది వరకు ఉత్తర్వులు జారీ చేశామని కేంద్రం పేర్కొంది. తాజాగా పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపింది. ఆర్థిక వృద్ధిని అనుసరించి దేశంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగినట్లు చెప్పుకొచ్చింది. ఆగస్టు నెల మొత్తం 200 గిగావాట్లకు మించి డిమాండ్ నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గరిష్ఠ డిమాండ్ 236.6 గిగావాట్లను తాకినట్లు వెల్లడించింది. ఇది గత ఏడాది ఆగస్టు నెలలో కనిపించిన డిమాండ్ కంటే 21 శాతం ఎక్కువ అని కేంద్రం పేర్కొంది. దేశీయంగా అందుబాటులోకి వస్తున్న బొగ్గు, దాని ఉపయోగం మధ్య నిరంతరం భారీగా వ్యత్యాసం కనిపిస్తోందని చెప్పుకొచ్చొంది. 


ఆగస్టు లో రోజుకు 2 లక్షల టన్నుల మేర కొరత కనిపించిందని, ఆ కొరతను కొంత మేరకు విదేశీ బొగ్గు ద్వారా పూడ్చగలిగినట్లు కేంద్రం చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో అంటే అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకు 404 మిలియన్ టన్నుల దేశీయ బొగ్గు అవసరం అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసినట్లు వెల్లడించింది. అయితే రైల్వే నెట్ వర్క్ తో ఉన్న ఇబ్బందుల వల్ల వచ్చే 6 నెలల కాలంలో 397 మిలియన్ టన్నుల దేశీయ బొగ్గు మాత్రమే సరఫరా చేయడానికి వీలు అవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అని వెల్లడించింది. దీని వల్ల వచ్చే 6 నెలల వరకు కనీసం 4 శాతం విదేశీ బొగ్గును దేశీయ బొగ్గుతో కలిపి వాడాలని నిర్ణయించినట్లు రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర సర్కారు వివరించింది. అందువల్ల అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు 4 సాతం విదేశీ బొగ్గును కలపడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని లేఖల్లో పేర్కొంది.


భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్


దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగిపోయింది. రాత్రిపూట కూడా భారీగా వినియోగం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వ్యవసాయానికి పగటి వేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రాత్రివేళల్లో అస్సలే పంట సాగు కోసం కరెంటు ఇవ్వకూడదని వివరించింది. పగటి వేళల్లో డిమాండ్ మరీ ఎక్కువ అయితే సౌర, పవన విద్యుత్ తో తీర్చవచ్చని స్పష్టం చేసింది. ఈనెల ఒకటవ తేదీన పగటి పూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు పెరిగిపోయినా తీర్చడం సాధ్యం అయిందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొరత ఉందని తెలిపింది.


కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈనెల ఒకటవ తేదీన ఈ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదు అయిందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని అందువల్లే విద్యుత్ సరఫరాను పగటి వేళకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ.. కేంద్ర విద్యుత్ శాఖ ఈనెల 5వ తేదీన అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన విషయం తెలిసిందే.