Actor Thalapathy Vijay's Political Party To Be Named 'Tamizhaga Munnetra Kazhagam': ఇంతకాలం సినిమాల ద్వారా ప్రజలను అలరించిన తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడున్న పార్టీల్లో చేరకుండా, కొత్త పార్టీ స్థాపించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, పార్టీ పేరు, పార్టీ జెండా కూడా రెడీ అయినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పార్టీని ప్రకటించి, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
విజయ్ దళపతి పొలిటికల్ పార్టీ పేరు ఏంటంటే?
విజయ్ దళపతి ఏర్పాటు చేయబోయే పార్టీకి ‘తమిళగ మున్నేట్ర కళగం’ (TMK) అని పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, వచ్చే నెల(ఫిబ్రవరి) తొలివారంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే సభలో పార్టీ జెండా సహా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చాలా కాలంగా వినిపిస్తున్న పొలిటిక్ ఎంట్రీ వార్తలు
విజయ్ చాలా కాలంగా రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఆయన పలు సేవా కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. గత డిసెంబర్ వరదలతో అతలాకుతలమైన తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. వరదబాధితులకు నిత్యవసర సరుకులను అందించారు. అంతేకాదు, ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. తమిళనాడులో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఈ సంఘం పాల్గొన్నది. విజయ్ కి తమిళనాట పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రజల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు విజయ్.
‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‘ Vijay సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై ?
రీసెంట్ గా విజయ్ ‘లియో’ సినిమాలో కనిపించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కాస్త నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లును బాగానే రాబట్టింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక, సినిమాల్లో నటించడం మానేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.
Read Also: చీర, జాకెట్‌లో అల్లు అర్జున్, ‘ఫుష్ప 2’ నుంచి ఫోటో లీక్, షాక్‌లో మేకర్స్