Tamil Nadu CM Stalin Meets Djokovic:  తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌(Tamil Nadu CM Stalin) 8 రోజుల పర్యటన కోసం స్పెయిన్‌ వెళ్లారు. అయితే, స్పెయిన్‌ వెళుతుండగా విమానంలో ఆయనకు టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌(Tennis legend Novak Djokovic) కనిపించాడు. దాంతో, ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయిన స్టాలిన్ వెంట‌నే వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1తో మాట క‌లిపాడు. అనంత‌రం ఫొటో దిగారు. ‘ఆకాశవీధిలో ఆశ్చర్యకరమైన కలయిక’ అంటూ స్టాలిన్‌ దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  ప్ర‌స్తుతం ఆ ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌(Australian Open 2024)లో ఓట‌మి అనంత‌రం జ‌కో స్వ‌దేశమైన సెర్బియాకు బ‌య‌లుదేరాడు. ఆ స‌మ‌యంలోనే అత‌డు స్టాలిన్‌కు క‌లిసి ఉంటాడు.


వరుసగా 33 విజయాలు కానీ .. 


ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024  వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ కు సెమీస్ లో బిగ్ షాక్ తగిలింది. రికార్డు స్థాయిలో పదకొండోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలవాలన్న జకోవిచ్ ఆశలపై.. నాలుగో సీడ్‌ ఇటలీకి చెందిన యానిక్‌ సినెర్ నీళ్లు చల్లాడు. సెమీఫైనల్ లో 22 ఏళ్ల సినర్‌ ముందు.. జకోవిచ్‌ తలవంచక తప్పలేదు. జకోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి మరీ సినర్‌ తన కెరీర్‌లోనే భారీ విజయం సాధించాడు. 6-1, 6-2, 6-7, 6-3తో జకోవిచ్‌పై గెలుపొందాడు.


2018 తర్వాత మెల్ బోర్న్‌ పార్క్‌లో జకోవిచ్‌ ఏ మ్యాచ్‌ను ఓడిపోలేదు. వరుసగా 33 విజయాలతో చరిత్ర సృష్టించిన జకోకు, యువ ఆటగాడు సినర్ షాక్‌ ఇచ్చాడు. గతంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌ చేరిన ప్రతీసారి జొకోవిచ్‌ టైటిల్‌ గెలుచుకోగా... తొలిసారి సెమీస్‌లో వెనుదిరిగాడు. సెమీస్ లో జకోవిచ్ వరుసగా తొలి రెండు సెట్లను 1-6, 2-6 తేడాతో సినర్ కు కోల్పోయాడు. అప్పటివరకూ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన జకో, మూడో సెట్ లో మాత్రం తీవ్రంగా పోరాడి 7-6 (8/6)తో రేసులో నిలిచాడు. అయితే, నాలుగో సెట్ లో విజృంభించిన సినర్.. 6-3తో సత్తా చాటి ఫైనల్ కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో జకోవిచ్ నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా, సినర్ ఒక్కసారి మాత్రమే చేశాడు.  


ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా రోహన్ బోపన్న


భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న(Rohan Bopanna) చరిత్ర సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియన్‌ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న 7-6,7-5 తేడాతో ఇటలీ జోడి సిమోన్‌- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్‌ గ్రాండస్లామ్‌ టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. ఇటీవల అతిపెద్ద వయసులో డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న రోహన్ బోపన్న తాజాగా గ్రాండ్ స్లామ్ డబుల్స్ విజేతగా అవతరించాడు. 


సబలెంకాదే ఆస్ట్రేలియన్‌ ఓపెన్


డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అరీనా సబలెంకా(Aryna Sabalenka) వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బెలారస్‌ భామ అరీనా సబలెంకా  ఆస్ట్రేలియన్ ఓపెన్‌ విజేతగా నిలిచింది.