Man Stucked in Train And Platform in Vikarabad Station: 'దయచేసి వినండి'.. రైలు బండి చలనంలో ఉండగా ఎక్కుట గానీ.. దిగుట గానీ ప్రమాదకరం అంటూ హెచ్చరికలు మనకు రైల్వే స్టేషన్ లో వినిపిస్తుంటాయి. అలా రైలు కదులుతున్నప్పుడు ఎక్కొద్దని ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరు పెడచెవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్ లో సోమవారం రాత్రి జరిగింది. కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. ప్లాట్ ఫాం, రైలు మధ్యలో చిక్కుకుని 2 గంటలు నరకయాతన అనుభవించాడు. గమనించిన రైల్వే సిబ్బంది రైలును ఆపి అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.


ఏం జరిగిందంటే.?


వికారాబాద్ (Vikarabad) రైల్వేస్టేషన్ లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. ప్లాట్ ఫాంపై ఉన్న వ్యక్తి కదులుతున్న యశ్వంత్ పూర్ రైలు ఎక్కేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి ప్లాట్ ఫాం, రైలు మధ్యలో పడి ఇరుక్కుపోయాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపేయించారు. ప్లాట్ ఫాంను పగులగొట్టి బాధితున్ని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి రాయచూర్ కు చెందిన సతీష్ గా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనతో యశ్వంత్ పూర్ రైలు 2 గంటల పాటు నిలిచిపోయింది.






Also Read: Indian Railway News : రైల్వే ప్రయాణికులకు మరో షాకింగ్ న్యూస్- ఇకపై అలాంటి సర్దుబాటు కుదరదు