తెలుగులో 'గజినీ' సినిమాతో సూర్య (Suriya) తొలి విజయం అందుకున్నారు. అయితే, ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్, స్టార్‌డమ్ తీసుకు వచ్చిన ఘనత మాత్రం 'సింగం' సిరీస్ చిత్రాలకు దక్కుతుంది. ఆ విజయాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి పాత్ర కూడా ఉంది. అవును... సిల్వర్ స్క్రీన్ మీద సూర్య సింహంలా తన నటనతో చెలరేగితే, ఆ నటనకు తన గొంతుతో జీవం ఇచ్చారు శ్రీనివాస మూర్తి. ఈ రోజు ఆకస్మికంగా ఆయన మృతి చెందారు. ఆయన మరణంతో సూర్య ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలిపారు. 


మిస్ యు డియర్!
''శ్రీనివాస మూర్తి మరణం వ్యక్తిగతంగా నాకు ఎంతో లోటు. తన గొంతు, భావోద్వేగాల ద్వారా తెలుగులో నా నటనకు, పాత్రలకు ప్రాణం పోశారు. మిస్ యు డియర్.  చాలా త్వరగా వెళ్లిపోయావ్'' అని సూర్య ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కొన్ని పదాలే కావచ్చు... ఆ మాటల్లో క్లుప్తంగా శ్రీనివాస మూర్తిపై తనకు ఉన్న అభిమానాన్ని, తన అనుబంధాన్ని తెలియజేశారు. 






తెలుగు, తమిళ సినిమా ప్రేక్షకుల్లో శ్రీనివాస మూర్తికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టుగా కొన్నేళ్ళుగా ఆయన సేవలు అందిస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ అయ్యే సినిమాల్లో... స్టార్ తమిళ హీరోలు అందరికీ ఆయనకు డబ్బింగ్ చెప్పారు. 


ఒక్క సూర్య మాత్రమే కాదు... అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి ప్రముఖ హీరోలకు ఆయన తెలుగు డబ్బింగ్ అందించారు. ఆయన గొంతులోని బేస్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేది. హీరోల నటనకు ఆ బేస్ తోడైతే... పంచ్, సన్నివేశంలో ఎమోషన్ ప్రేక్షకులకు చేరువ అయ్యేది. 


తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్
'అపరిచితుడు' విక్రమ్, 'సింగం' సిరీస్ , '24' సినిమాల్లో సూర్య, 'జనతా గ్యారేజ్'తో పాటు పలు మలయాళ తెలుగు డబ్బింగ్ సినిమాల్లో మోహన్ లాల్, 'అల వైకుంఠపురంలో' జయరామ్... ఇలా చెబుతూ వెళితే శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి.
 
తమిళ 'కెజిఎఫ్ 2'లో సంజయ్ దత్‌కు...
'కెజిఎఫ్ 2' తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. అందులో హిందీ హీరో సంజయ్ దత్ గొంతు శ్రీనివాస మూర్తిదే. తమిళం నుంచి తెలుగుకు వచ్చే సినిమాల్లో మాత్రమే కాదు.... ఇతర భాషల నుంచి తమిళంలో డబ్బింగ్ అయ్యే సినిమాలకు కూడా శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు. 


Also Read : హీరో, నిర్మాత ఫ్యామిలీకి బంగ్లా బహుమతి - అదీ జమున వ్యక్తిత్వం


శ్రీనివాస మూర్తి మృతి పట్ల తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడం బాధగా ఉందన్నారు.  చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం పట్ల తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస మూర్తిలాంటి  గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ సినీ పరిశ్రమకు మళ్లీ దొరకడం  కష్టమంటున్నారు. కంచు కంఠంతో ఆయన చెప్పే డబ్బింగ్ ఇకపై సినిమాల్లో వినిపించబోదని బాధపడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.


Also Read : రెండు పార్టులు పవన్ 'అన్‌స్టాపబుల్‌ 2' సందడి - ఫస్ట్ పార్ట్ ఎప్పుడంటే?