BBC Documentary: ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు సంబంధించి జేఎన్ యూ, జామియా మిలియా ఇస్లామియా, అలాగే పంజాబ్ విశ్వవిద్యాలయంలో వాగ్వాదం చెలరేగింది. మరోవైపు డాక్యుమెంటరీని నిషేధించడంపై ప్రతిపక్ష పార్టీలనేతలు.. ప్రధాని మోదీపై విరుచుకు పడుతున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం కావాలనే తమపై ఇలా ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. బీబీసీ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్ లలో బ్లాక్ చేసింది. కానీ ఆ డాక్యుమెంటరీ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇస్తోంది.


రాజకీయ కారణాలతో సినిమాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలను నిషేధించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ సహా పలు ప్రభుత్వాల్లో వివాదాస్పద చిత్రాలు, డాక్యుమెంటరీలపై చర్యలు తీసుకున్నారు. ఇందిరా హయాంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో చాలా బాలీవుడ్ సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి.


ఆ సినిమాలు, పుస్తకాలు ఏంటో మీకు తెలుసా?



  • కిస్సా కుర్సి కా: కిస్సా కుర్సి కా 1974లో నిర్మించిన ఈ సినిమా 1977లో విడుదల అయింది. ఈ చిత్రం విడుదలైన వెంటనే నిషేధించారు. ఈ చిత్రంలో షబానా అజ్మీ, రాజ్ బబ్బర్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తర్వాత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 51 అభ్యంతరాలతో చిత్ర నిర్మాతకు షోకాజ్ నోటీసులు పంపింది. ఈ నోటీసులో ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీతోపాటు ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని టార్గెట్ చేయడం వంటి అంశాలను గురించి ప్రస్తావించారు. సంజయ్ గాంధీ, వీసీ శుక్లా కూడా ఈ సినిమా ప్రింట్‌ను తగలబెట్టారని అప్పట్లో చాలానే ఆరోపణలు వచ్చాయి. అతనిపై 11 నెలల పాటు కేసు కూడా నడిచింది.

  • తమిళ నాటకం కుట్రపత్తిరికై: ఈ చిత్రం 1993లో నిర్మించారు. కానీ 2007 వరకు విడుదల కాకుండా నిషేదించారు. ఈ సినిమాను బ్యాన్ చేయడానికి కారణం సినిమా కథ. ఇది రాజీవ్ గాంధీ, శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో రూపొందించారు.

  • ఆంధీ: ఈ చిత్రం 1975లో విడుదలైంది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలం ఇది. ఈ సినిమా కథలో కనిపించే ప్రధాన పాత్ర సుచిత్రా సేన్ చీరకట్టు, హెయిర్ స్టైల్, నడిచే విధానం, మాట్లాడే విధానం ఇలా చాలా చిన్న విషయాల్లో ఇందిరా గాంధీని పోలి ఉండేది. దీంతో ఇందిరా గాంధీలా కనిపించే హీరోయిన్‌ సినిమాలో స్మోకింగ్, డ్రింకింగ్‌ చేస్తుండగా చూపించడంతో వివాదాల్లో ఇరుక్కుంది. అయితే ఈ సినిమాను కొన్నాళ్లు నిషేధించారు. కానీ 1977లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాపై నిషేధాన్ని ఎత్తివేశారు. 

  • బ్లాక్ ఫ్రైడే: ఈ చిత్రం 2004లో విడుదలైంది. 1993 బాంబే పేలుళ్ల ఆధారంగా ఈ చిత్రం విడుదలకు ముందే నిషేధించారు. అయితే ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో ఆ తర్వాత రిలీజ్ చేశారు.

  • ఇన్షాల్లా కాశ్మీర్: ఈ చిత్రాలే కాకుండా మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో కశ్మీర్ సంక్షోభంపై తీసిన డాక్యుమెంటరీ 'ఇన్షాల్లా కాశ్మీర్'పై కూడా నిషేధం విధించారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో నిషేధించిన పుస్తకాలు..


1964, 1997 మధ్య ఏడుగురు ప్రధాన మంత్రుల హయాంలో మొత్తం 17 పుస్తకాలు నిషేధించారు. ఈ 17 పుస్తకాల్లో చాలా వరకు ఇందిరా గాంధీ హయాంలో నిషేధించినవే. 1988లో 'సాటానిక్ వెర్సెస్' నిషేధించారు. ఇది సల్మాన్ రష్దీ రాసిన ప్రసిద్ధ పుస్తకం. దాని నిషేధం సమయంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 'ది ప్రైస్ ఆఫ్ పవర్'పై ఈ పుస్తకం అమ్మకాన్ని నిలిపి వేశారు. ఈ సమయంలో అతను పబ్లిషర్‌పై యూఎస్ కోర్టులో దావా వేశారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అమెరికా నిఘా సంస్థ సీఐఏకు ఏజెంట్ అని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో 'స్మాష్ అండ్ గ్రాబ్: అనెక్సేషన్ ఆఫ్ సిక్కిం' పుస్తకాన్ని కూడా నిషేధించారు. 


బీబీసీ డాక్యుమెంటరీలో అసలేముంది?


నిజానికి "ఇండియా:క్వశ్చన్ ద మోదీ" డాక్యుమెంటరీ అనేది 2022 గుజరాత్ అల్లర్ల గురించి వర్ణించే రెండు భాగాల సిరీస్. ఈ డాక్యుమెంటరీలో ఆ సమయంలోని రాజకీయ పరిస్థితులు, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు చూపించారు. ఈ డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్ ను జనవరి 17వ తేదీన బ్రిటన్ లో ప్రసారం చేశారు.  రెండో భాగాన్ని జనవరి 24వ తేదీ 2023వ విడుదల చేశారు. ఇందులో మోదీ రాజకీయాల అంశాలను ప్రస్తావించారు. ఇందులో మోదీకి వ్యతిరేకంగా చాలా విషయాల గురించి వివరించారు. మోదీ రాజకీయ ప్రయాణం ప్రారంభ దశ గురించి కూడా ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం, బీజేపీలో ఆయన స్థాయి పెరగడం, గుజరాత్‌ సీఎంగా ఆయన నియామకం వంటి అంశాలు కూడా డాక్యుమెంటరీలో చర్చనీయాంశమయ్యాయి. ఆ డాక్యుమెంటరీలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో జరిగిన అల్లర్ల ప్రస్తావన అత్యంత వివాదాస్పదమైంది. ఈ సిరీస్ భారతదేశంలో విడుదల కాలేదు. అయితే ఇది లండన్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో విడుదలైంది.


భారత ప్రభుత్వం ఏం చెప్పింది?


ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ డాక్యుమెంటరీని దుష్ప్రచారంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అభివర్ణించారు. ఈ డాక్యుమెంటరీ ఏక పక్షంగా ఉందన్నారు. అందువల్లే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన నిషేధిస్తున్నామని ప్రకటించారు. ట్విట్టర్,  యూట్యూబ్ ఛానెళ్లలో ఉన్న ఈ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.