'తెలుగింటి సత్యభామ'గా జమున (Actress Jamuna) పేరు తెచ్చుకున్నారు. మాతృభాష కన్నడ అయినా సరే బాల్యమంతా గుంటూరులోని దుగ్గిరాలలో సాగడంతో చిన్నప్పటి నుంచి తెలుగులో గలగలా పాటలు పాడేవారు. చిత్ర పరిశ్రమలోకి ఆమె రావడానికి పునాదులు దుగ్గిరాలలో పడ్డాయి. కథానాయికగా ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత కూడా తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అనే విషయాన్ని మరువలేదు. తనను కథానాయిక చేసిన హీరో, నిర్మాత కుటుంబానికి ఆమె అండగా ఉన్నారు. అసలు వివరాల్లోకి వెళితే... 


జమునకు అవకాశం ఇచ్చిన రాజారావుకథానాయికగా జమున తొలి సినిమా 'పుట్టిల్లు'. అందులో హీరో డాక్టర్ రాజారావు. ఆ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. జమునకు తొలుత అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. అయితే, కథానాయికగా జమున కెమెరా ముందుకు వెళ్ళిన తొలి సినిమా మాత్రం 'పుట్టిల్లు' కాదు... 'జై వీర భేతాళ'. 


జమున దుగ్గిరాలలో ఉన్నప్పుడు... ఆ ఊరిలో ఉన్న తమ బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా శ్రీమన్నారాయణమూర్తి అని నటుడు వెళ్ళారు. స్కూల్ మైక్ లో జమున పాడిన పాట అతడి చెవిన పడింది. సాయంత్రం ఇల్లు వెతుక్కుంటూ జమునను చూడటానికి వెళ్ళారు. తనను తాను పరిచయం చేసుకుని మాట్లాడారు. పరిచయం పెరిగిన తర్వాత 'మీ అమ్మాయిని సినిమా పరిశ్రమకు పంపండి' అని ప్రతిపాదన పెట్టారు. జమున తల్లి కోప్పడటంతో ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ ఊరిలో బంధువుల ఇంటికి ఓ ముసలావిడ వచ్చింది. ఆవిడ కూడా జమున ముందు కథానాయిక ప్రతిపాదన తీసుకొచ్చింది. రాజమండ్రి వెళ్ళి రమ్మని కబురు కూడా పంపింది. అప్పుడు తండ్రితో కలిసి రాజారావును కలవడానికి జమున వెళ్ళారు. 


ప్రముఖ ఛాయాగ్రాహకులు వీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో సినిమా తీస్తున్నామని, ఆయన ఓకే అంటే కథానాయికగా అవకాశం ఇస్తామని రాజారావు చెప్పడంతో మళ్ళీ సొంత ఊరుకు వెళ్ళారు జమున. ఈలోపు శ్రీమన్నారాయణ పంపిన నిర్మాత రామానందం 'జై వీర భేతాళ'లో నటించే అవకాశం ఇచ్చారు. తనకు చెప్పకుండా ఆ సినిమా ఓకే చేసినందుకు తొలుత రాజారావు కోప్పడినా... ఆ తర్వాత 'అమ్మాయి ఆంధ్రా నర్గిస్ లా ఉంది' అని వీఎన్ రెడ్డి నుంచి కాంప్లిమెంట్ రావడంతో అవకాశం ఇచ్చారు. 'జై వీర భేతాళ' నిర్మాణ దశలో ఆగింది. ఆ తర్వాత మొదలైన 'పుట్టిల్లు' తొలి సినిమాగా విడుదలైంది.
 
నెలనెలా సరుకులు...
రాజారావు మరణం తర్వాత మేడ
'పుట్టిల్లు' సినిమా సరిగా ఆడలేదు. కానీ, జమున సినీ ప్రవేశానికి పునాది వేసింది. ఆ సినిమా తర్వాత ఆమె ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉన్నత స్థాయిలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల రాజారావుకు తెలియకుండా ఆయన ఇంటికి సామాన్లు, సరుకులు పంపేవారు. రాజారావు మరణించిన తర్వాత... 1964లో లక్ష రూపాయలతో అప్పటి మద్రాసు, ఇప్పటి చెన్నైలో హబీబుల్లా వీధిలో ఒక మేడ కొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఎన్టీఆర్ సలహాతో ఆమె ఆ పని చేశారని చిత్రసీమలో కొందరు చెప్పే మాట. జమున ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించింది లేదు. కొత్త హీరోల సరసన కూడా సినిమాలు చేశారు.


Also Read : జమున నెత్తి మీద పడిన హీరో - మెడ సమస్యకు కారణం ఆ ప్రమాదమే