Stock Market Opening 27 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకంపనలు ఇంకా చల్లారలేదు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినా మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 164 పాయింట్ల నష్టంతో 17,727 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 601 పాయింట్ల నష్టంతో 59,603 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు తీవ్రంగా ఎరుపెక్కాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో షేర్లకు డిమాండ్ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,205 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,166 వద్ద మొదలైంది. 59,543 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,166 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 601 పాయింట్ల నష్టంతో 59,603 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,891 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,877 వద్ద ఓపెనైంది. 17,715 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,884 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 164 పాయింట్ల నష్టంతో 17,727 వద్ద చలిస్తోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. ఉదయం 42,382 వద్ద మొదలైంది. 40,733 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,417 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 814 పాయింట్లు తగ్గి 40,833 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, సిప్లా షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీగా పతనమయ్యాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా మోటార్స్: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 2,958 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనా వేసిన రూ. 285 కోట్ల లాభం కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ. 1,516 కోట్ల నష్టం నుంచి చాలా బలంగా కోలుకుంది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం సంవత్సరానికి 22.5% పెరిగి రూ. 88,489 కోట్లకు చేరుకుంది.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో, ఈ డ్రగ్‌మేకర్ స్ట్రీట్ అంచనాలను అధిగమించి నికర లాభాన్ని 77% వృద్ధితో రూ.1,247 కోట్లకు పెంచుకుంది. ఆదాయం 27% పెరిగి రూ. 6,770 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ త్రైమాసికంలో, కంపెనీ స్థూల మార్జిన్ 53.8% నుంచి 59.2%కి పెరిగింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఈ కంపెనీ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) ఇవాళ (శుక్రవారం, 27 జనవరి 2023) సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA), అల్ మెహ్వార్ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటీ గ్రూప్ గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్, LIC, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, SBI పెన్షన్ ఫండ్ వంటి ప్రముఖ కంపెనీలు సహా 30కి పైగా సంస్థాగత పెట్టుబడిదార్ల నుంచి ఈ కంపెనీ దాదాపు రూ. 6,000 కోట్లను సమీకరించింది. FPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 3,112- 3,276. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లు ఒక్క రోజులో రూ. 1 లక్ష కోట్ల మేర కోల్పోయారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.