కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య.. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రయోగాత్మక కథల్లో నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన హిట్టు మీద హిట్టు కొడుతున్నారు. ఆయన నటించిన 'ఆకాశం నీ హద్దురా..', 'జైభీమ్' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఓటీటీల్లోనే విడుదలైన ఈ సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 

 

ముఖ్యంగా 'జైభీమ్' సినిమా ఎందరినో కదిలించింది. ఒక గిరిజన మహిళ పోరాటాన్ని ఆధారంగా చేసుకొని దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను రూపొందించగా.. సూర్య స్వయంగా నిర్మించారు. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఐఎండీబీలో ఈ సినిమాకి అత్యధిక రేటింగ్స్‌ వచ్చాయి. అలానే గోల్డెన్ గ్లొబ్ 2022 పురస్కారానికి కూడా ఈ సినిమా నామినేట్ అయింది. 

 

తాజాగా ఈ సినిమాకి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో 'సీన్‌ ఎట్‌ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్ ను షేర్ చేయడం ఇదే తొలిసారి. దీంతో 'జైభీమ్' చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. అత్యున్నత గౌరవం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.