Sound Party Movie has a hilarious surprise, says VJ Sunny in Interview: సన్నీ కొందరికి వీజేగా తెలుసు. మరికొందరికి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 5 విజేతగా తెలుసు. ఇంకొందరికి హీరోగా తెలుసు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగిన ఈతరం యువకులలో వీజే సన్నీ ఒకరు. ఆయన నటించిన 'సౌండ్ పార్టీ' సినిమా శుక్రవారం విడుదలవుతోంది.
'సౌండ్ పార్టీ' సందర్భంగా మీడియాతో ముచ్చటించిన సన్నీ... ''బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చేసిన ప్రాజెక్టులలో బెస్ట్ సినిమా 'సౌండ్ పార్టీ'. ఈ సినిమా కోసం 100 పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను'' అని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లో...
పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని...
''ప్రేక్షకులు ఎవరైనా 'సౌండ్ పార్టీ' చూసిన తర్వాత డిజప్పాయింట్ అవ్వరు. అంత నవ్విస్తుందీ సినిమా. నాకు కామెడీ జానర్ అంటే చాలా ఇష్టం. గతంలో కొన్ని కామెడీ సినిమాలు చేశా. కానీ, వర్కౌట్ అవ్వలేదు. 'ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే రా బట్టుకోవాలి' అనే ఫార్ములాతో... కామెడీ సినిమాతో హిట్ అందుకోవాలని 'సౌండ్ పార్టీ' చేశా'' అని సన్నీ చెప్పారు. గతంలో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని పూర్తి చేశానని ఆయన తెలిపారు.
సరదాగా తండ్రీ కుమారుల మధ్య స్నేహం!
"ఈ సినిమాలో శివన్నారాయణ గారు, నేను తండ్రీ కొడుకులుగా నటించాం. మా రెండు పాత్రల మధ్య స్నేహాన్ని సరదాగా చూపించాం. డబ్బులు కోసం తండ్రీ కొడుకులు ఏం చేశారు? అనేది కాన్సెప్ట్! ఏం చేయకూడదు? అనేది సినిమాలో చూపించాం. ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. కథలో బిట్ కాయిన్ కూడా కీలక పాత్ర పోషించింది. సినిమాలో పెద్ద సర్‌ప్రైజ్ ఉంది. అది ఏమిటో తెరపై చూడాలి. హీరోగా నన్ను ఎంపిక చేయడానికి కారణం దర్శకుడు సంజయ్ శేరి. నిర్మాతలకు నన్ను రిఫర్ చేసింది ఆయనే. నిర్మాతలు కొత్తవారైనా రాజీ పడకుండా సినిమా తీశారు'' అని సన్నీ చెప్పారు.
ఆమని గారి మేనకోడలు అని తెలియదు!
'సౌండ్ పార్టీ'లో కథానాయికగా నటించిన హృతికా శ్రీనివాస్ సీనియర్ హీరోయిన్, నటి ఆమని మేనకోడలు. చిత్రీకరణ చేసేటప్పుడు తనకు ఆ విషయం తెలియదని సన్నీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''హృతికా శ్రీనివాస్ చాలా డౌటు ఎర్త్. అంకిత భావంతో నటించింది. కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ చిత్రానికి 'వెన్నెల' కిశోర్ గారు వాయిస్ ఓవర్ ఇస్తే... నాని అన్న కూడా ప్రమోషన్స్ విషయంలో మద్దతుగా నిలిచారు. సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చింది. అమెరికాలో ప్రీమియర్ వేస్తే వందకు వంద మార్కులు వేశారు'' అని అన్నారు.
Also Read: నాగ చైతన్య చేపల వేట - 'తండేల్' కోసం ఎలా మారిపోయాడో చూశారా?
ప్రస్తుతానికి కొత్త సినిమాలు ఏవీ అంగీకరించలేదని... తనకు ప్రయోగాత్మక పాత్రలు కూడా చేయాలని ఉందని సన్నీ తెలిపారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు.
Also Read: విచిత్రకు టార్చర్ - హీరో పిలిస్తే గదికి వెళ్ళలేదని, నోరు విప్పిన 'బిగ్ బాస్' నటి!