ఈతరం ప్రేక్షకులకు విచిత్ర ఎవరో పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, 90వ దశకంలో జనాలకు ఆమె బాగా తెలుసు. తమిళంలో పలు చిత్రాలు చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ 'పోకిరి రాజా', నట సింహం నందమూరి బాలకృష్ణ 'భలే వాడివి బాసు' సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తమిళ 'బిగ్ బాస్' షోలో ఉన్నారు. కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పాలి. అప్పుడు విచిత్ర తనకు ఓ సినిమా చిత్రీకరణలో దారుణ పరాభవం జరిగిందని చెప్పుకొచ్చారు. 


తన రూంకు రమ్మని హీరో పిలిచాడు! వెళ్లలేదని... 
ఓ సినిమా చిత్రీకరణలో అగ్ర కథానాయకుడు తనను రూంకు రమ్మని పిలిచాడని విచిత్ర వెల్లడించారు. తాను వెళ్ళకపోవడంతో తనకు టార్చర్ చూపించారని, ఆ టార్చర్ తట్టుకోలేక తాను రోజుకొక రూంలో ఉండాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ''అప్పట్లో ఆ స్టార్ హీరో సినిమా షూటింగ్ కోసం నేను వెళ్లాను. మేం ఉన్న హోటల్ జనరల్ మేనేజర్ నా భర్త. షూటింగ్ తర్వాత పార్టీ ఉందని... రావాలని ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ పార్టీలో హీరోని కలిశా. ఆయన నా పేరు కూడా అడగలేదు. 'నువ్వు ఈ సినిమాలో నటిస్తున్నావా?' అని అడిగారు. 'అవును' అని చెప్పా. వెంటనే రూంకి రమ్మని పిలిచారు. స్టార్ హీరో అలా అడిగే సరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రి నా గదికి వెళ్లి నిద్రపోయా. తర్వాత రోజు నుంచి నాకు టార్చర్ మొదలైంది'' అని 'బిగ్ బాస్' ఇంటిలో విచిత్ర వెల్లడించారు. 






హీరో పిలిచిన తర్వాత గదికి వెళ్ళకపోవడంతో తనను రకరకాలుగా ఇబ్బందులు పెట్టారని విచిత్ర తెలిపారు. ప్రతి రోజూ ఎవరో ఒకరు తాగి వచ్చి తన గది తలుపులు కొట్టే వారని ఆమె వివరించారు. హోటల్ జనరల్ మేనేజర్ నా భర్త కావడంతో ఆయన సహకారంతో రోజుకు ఒక గదిలో ఉన్నానని, తాను ఏ గదిలో ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నామని విచిత్ర పేర్కొన్నారు. దాంతో చిత్రీకరణలో తనను వేధించడం మొదలు పెట్టారని ఆమె తెలిపారు. 


Also Read: ప్రియదర్శి ట్విస్ట్ - 'మంగళవారం'లో మాస్క్ వెనుక నుంచి ముందు!


చిత్రీకరణలో ఎదురైన వేధింపుల గురించి విచిత్ర మాట్లాడుతూ ''పల్లెటూరు, గిరిజన వాతావరణం నేపథ్యంలో ఓ సన్నివేశం తీస్తున్నారు. అక్కడ కొందరు నన్ను అసభ్యంగా తాకారు. స్టంట్ మాస్టర్, దర్శకుడికి వెళ్లి చెబితే... అందరి ముందు ఆయన నన్ను చెంప మీద కొట్టారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నా కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. నటీనటుల సంఘానికి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. పత్రికల్లో పెద్ద వార్త వచ్చినప్పటికీ నాకు ఎవరూ సాయం చేయలేదు. గౌరవం లేని చోట పని చేయడం ఎందుకని నా భర్త ప్రశ్నించారు. నేను ఇండస్ట్రీని ఫ్యామిలీలా భావించినా... ఇండస్ట్రీ అలా అనుకోలేదు. ఆ ఘటన తర్వాత ఇక ఇండస్ట్రీలో ఉండటం తగదని సినిమాలు మానేశా'' అని చెప్పుకొచ్చారు. 


కేరళలోని అలెప్పీలో ఆ ఘటన జరిగిందని విచిత్ర పేర్కొన్నారు. సినిమాల్లో ఎంతో మంది హీరోలతో తాను నటించినప్పటికీ... తనకు మంచి జీవితాన్ని ఇచ్చిన తన భర్తే తనకు అసలైన హీరో అన్నారు విచిత్ర. సుమారు వందకు పైగా సినిమాల్లో విచిత్ర నటించడంతో... ఆవిడ ఏ హీరోని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  


Also Read: 'రానా నాయుడు 2' అప్డేట్ ఇచ్చిన వెంకీ - ఈసారి ఆ సీన్లు, బూతులు తగ్గుతాయా?