ఓ శుక్రవారం తన జీవితాన్ని మారుస్తుందని ప్రతి నటుడు ఎదురు చూస్తాడని... అయితే మంగళవారం తన జీవితాన్ని మార్చిందని నటుడు, కథానాయకుడు ప్రియదర్శి సంతోషం వ్యక్తం చేశారు. అగ్ర హీరోలతో పాటు యువ కథానాయకుల చిత్రాలలో ఆయన కీలక పాత్రలు చేస్తున్నారు. మరోవైపు కొత్త తరహా కథలు వచ్చినప్పుడు హీరోగా నటిస్తున్నారు. 'మల్లేశం', 'బలగం' చిత్రాలతో హీరోగా విజయాలు అందుకున్న ప్రియదర్శి... తాజాగా 'మంగళవారం'తో మరో విషయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.


'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. ఇందులో పాయల్ ప్రధాన పాత్రధారి. సినిమా విడుదల ముందు వరకు ఆమెకు జోడీగా 'రంగం', రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' సినిమాల ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారని అందరూ అనుకున్నారు. దర్శక నిర్మాతలు సైతం పాయల్, అజ్మల్ మీద తీసిన పాటను విడుదల చేశారు. 'మంగళవారం' థియేటర్లలోకి వచ్చిన తర్వాత అసలు విషయం బయట పడింది. 


సినిమాలో పాయల్ బాల్య మిత్రుడు...  
ఆమెను ప్రేమించినోడు ప్రియదర్శి!
'మంగళవారం' సినిమా పోస్టర్ల మీద మొదటి నుంచి మాస్క్ కనిపించింది. ఆ మాస్క్ వెనుక మనిషి ఎవరు? అనే విషయంలో సస్పెన్స్ మైంటైన్ చేశారు. థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత కొందరు స్పాయిలర్స్ ఇచ్చారు. అయితే... మెజారిటీ ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు మాత్రం మాస్క్ వెనుక మనిషి గురించి చెప్పలేదు. కానీ, ఇప్పుడు చిత్ర బృందం నేరుగా అతడు ఎవరో చెప్పేశారు. సినిమాలో హీరోయిన్ పాయల్ బాల్య మిత్రుడిగా, ఆమెను ప్రేమించిన వ్యక్తిగా ప్రియదర్శి నటించారని మేజర్ ట్విస్ట్ రివీల్ చేసింది. 


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా... స్టేజి మీద ప్రియదర్శి మాస్క్ రివీల్ చేశారు. ఆ తర్వాత విశ్వక్ సేన్ మాట్లాడుతూ ''సాధారణంగా మంచి సినిమాలు చేసినప్పుడు పేరు వస్తే, డబ్బులు రావు. ఒకవేళ డబ్బులు వస్తే పేరు రాదు. ప్రియదర్శి చేస్తున్న సినిమాలకు పేరుతో పాటు డబ్బులు కూడా వస్తున్నాయి. ఆయన 'మల్లేశం', 'బలగం', ఇప్పుడీ 'మంగళవారం'... వరుస విజయాలు అందుకుంటున్నాడు. నాకు అజయ్ భూపతి దర్శకత్వం అంటే ఇష్టం. నేను ఆయన ఫ్యాన్. రెండున్నర గంటలు నిజాయతీగా సినిమా తీసే దర్శకుడు ఆయన. ఇటువంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు క్వాలిటీగా తీయాలంటే నిర్మాతల సహకారం ఎంతో అవసరం. నాకు షూటింగ్ ఉండటం వల్ల సినిమా చూడటం కుదరలేదు. త్వరలో చూస్తా'' అని చెప్పారు.  


Also Read: 'రానా నాయుడు 2' అప్డేట్ ఇచ్చిన వెంకీ - ఈసారి ఆ సీన్లు, బూతులు తగ్గుతాయా?


ప్రియదర్శి మాట్లాడుతూ ''అజయ్ భూపతి కథ చెబుతున్నప్పుడు... నాకు పులి క్యారెక్టర్ నచ్చింది. నేను ఆ రోల్ చేస్తానేమో అనుకున్నా. తర్వాత ఫోటోగ్రాఫర్ వాసు రోల్ బాగా నచ్చింది. అది చేయాలని అనుకున్నా. కానీ, ఆ తర్వాత అజయ్ అన్న మాలచ్చమ్మ చేయమని అడిగారు. ఆ పేరు, పాత్ర కూడా నచ్చాయి'' అని చెప్పారు. ఇది థియేటర్లలో చూసే సినిమా అని, అందరూ థియేటర్లకు వెళ్లి చూడామని ఆయన రిక్వెస్ట్ చేశారు. సాధారణంగా నటీనటులు అందరూ తెరపై తమ ముఖం కనిపించాలని కోరుకుంటారని... సినిమాలో 80 శాతం మాస్క్ ధరించే పాత్ర అయినప్పటికీ, మాలచ్చమ్మ పాత్రలో నటించడానికి అంగీకరించిన ప్రియదర్శికి థాంక్స్ అని అజయ్ భూపతి చెప్పారు.


Also Read'ధృవ నక్షత్రం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - విక్రమ్ సినిమా ఎలా ఉందంటే?