ICC ODI WC 2023:  భారత్(Bharat) వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World cup) ముగిసి రెండు రోజులైంది. అయినా సెమీస్(Semi-Finals) వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా(Team India) ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు.  మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Kohli), మహ్మద్ సిరాజ్(Siraj) కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది. ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి  గల కారణంపై రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ(Pm Modi) ఒక చెడు శకునమని అన్నారు. 


గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్‌(Ahamadabad) స్టేడియానికి ప్రధాని మోడీ వెళ్లడం వల్లే ఆస్ట్రేలియా(Austrelia)తో జరిగిన 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందని రాహుల్‌గాంధీ విమర్శించారు. మన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ గెలుచుకున్నారని, కానీ చెడు శకునం వారిని ఓడిపోయేలా చేసిందంటూ ఎద్దేవా చేశారు. వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి చెడు శకునం వచ్చిందని... దీంతో టీమిండియా గెలిచే మ్యాచ్‌ కూడా ఓడిపోయిందని రాహుల్‌ ఆరోపించారు. టీవీలలో ఈ విషయాన్ని చూపించరని.. కానీ దేశ ప్రజలకు ఈ విషయం తెలుసని కూడా వ్యాఖ్యానించారు. రాజస్తాన్ లోని జాలోర్ లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. వరల్డ్ కప్ ఫైనల్ ప్రస్తావన తెచ్చారు. యువతను ఉత్సాహపరుస్తూ వరల్డ్ కప్ ఫైనల్లో మనోళ్లు గెలిచే వాళ్లే కానీ.. చివర్లో చెడు శకనం రావడం వల్లే ఓడిపోయారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. 


ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినా ఫైనల్లో ఓడిపోవడంతో తమ గుండె బద్దలైందని రవీంద్ర జడేజా ట్వీట్‌ చేశాడు. మీ మద్దతుతోనే మేం ముందుకు సాగుతున్నామని ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించిందన్న రవీంద్ర జడేజా... ఇదీ ఎంతో ప్రేరణనిచ్చిందని జడ్డూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. షమీ కూడా మరో ఫొటోను షేర్‌ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని తాను చేసిన ట్వీట్‌లో ఈ స్పీడ్‌ స్టార్‌ పేర్కొన్నాడు. పంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌సేనపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని కపిల్‌ తెలిపాడు. ఛాంపియన్స్‌లా ఆడారని... సగర్వంగా తల ఎత్తుకోండని సూచించారు.