ICC ODI WC 2023: భారత్(Bharat) వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World Cup) ముగిసి రెండు రోజులైంది. అయినా సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా( team India) ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు.  మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది. ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. 



 ప్రపంచకప్‌ తుదిపోరులో ఓటమిపాలైన భారత జట్టుకు దేశంలోని ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, దిగ్గజ ఆటగాళ్లు కపిల్‌ దేవ్‌, సచిన్ టెండూల్కర్‌ ఇలా చాలామంది టీమిండియాకు అండగా నిలిచారు. టోర్నీ ఆసాంతం రికార్డులను లెక్కచేయకుండా జట్టు కోసం సర్వశక్తులు ధారపోసిన హిట్‌మ్యాన్‌ కంట తడి చూసి సెలబ్రిటీలు, వ్యాపార దిగ్గజాలు కూడా చలించిపోయారు. తాజాగా ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఎడల్‌వీస్‌ సీఈవో రాధికా గుప్తా... ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. గొప్ప నాయకులకు కూడా చెడ్డ రోజులు ఉంటాయంటూ రాధిక గుప్తా పోస్ట్‌ చేశారు. కన్నీరు మిమ్మల్ని ఏమాత్రం బలహీనపర్చలేదని.. వంద కోట్ల హృదయాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయి కెప్టెన్‌ అంటూ రాధిక చేసిన పోస్ట్‌ చూసి అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది నెటిజన్లు రాధికా అభిప్రాయంతో ఏకీభవిస్తూ తమ కామెంట్లను పోస్టు చేస్తున్నారు. హిట్‌మ్యాన్‌.. నువ్వు మా ఛాంపియన్‌ అంటూ నెట్టింట పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. 



  కప్పు గెలవకపోయినా రోహిత్‌ శర్మ నాయకత్వం... ఆటతీరు ఈ ప్రపంచకప్‌నే ప్రత్యేకంగా నిలిపింది. ఈ ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 11 మ్యాచ్‌ల్లో మొత్తం 597 పరుగులు చేశాడు. ఇది ప్రపంచ కప్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని ఘనత. అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు హిట్‌మ్యాన్. ఈ రికార్డులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, మరో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ పేరు మీద ఉండేది. ఇప్పుడు రోహిత్ శర్మ వాళ్లను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. 
 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌సేనపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని కపిల్‌ తెలిపాడు. ఛాంపియన్స్‌లా ఆడారని... సగర్వంగా తల ఎత్తుకోండని సూచించారు. మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదని... మీరెప్పుడో విజేతలుగా నిలిచారని గుర్తు చేశాడు. మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోందని.... రోహిత్‌.. తన పనిలో మాస్టర్‌ నువ్వుని అన్నాడు భవిష్యత్తులో మరిన్ని విజయాలు రోహిత్‌ కోసం ఎదురు చూస్తున్నాయని కపిల్‌ దేవ్‌ అన్నాడు. ఇది కష్టకాలమని తనకు తెలుసని.... కానీ స్ఫూర్తిని కోల్పోవద్దని... భారత్‌ మీకు మద్దతుగా ఉందన్నాడు.