CDPO Recruirment: తెలంగాణలో ఐసీడీఎస్ పరిధిలోని 54 శిశు అభివృధ్ధి ప్రాజెక్టు అధికారి (CDPO) పోస్టులతోపాటు మహిళా శిశు సంక్షేమశాఖలోని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (Supervisor) గ్రేడ్-1 పోస్టుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర హైకోర్టుల కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ పోస్టులు నియామక ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 


టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిరుడు సెప్టెంబర్‌లో సీడీపీవో పోస్టులకు పరీక్షలు నిర్వహించినా.. ఇంతవరకు నియామకాలు చేపట్టలేదని పేర్కొంటూ కె.నిఖితతో పాటు మరో 12 మంది పిటిషన్‌ వేశారు. గ్రేడ్‌-1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీచేసి.. నియామకాలు చేపట్టలేదంటూ సంహిత సహా 39 మంది వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. పరీక్షలకు లీకేజీ మచ్చలేదని, కాబట్టి ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు కమిషన్‌ను ఆదేశించింది.


విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్ ఆధారంగా కమిషన్ నియామక ప్రక్రియ చేపట్టిందని, మెరిట్ జాబితా ప్రకటించడంతోపాటు సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిందన్నారు. ఇతర ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ నియామకాలను కూడా నిలిపివేసిందన్నారు. వీటికి సంబంధించి ఎలాంటి లీకేజీ ఆరోపణలు లేవన్నారు. ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావు వాదనలు వినిపిస్తూ.. గ్రూప్-1, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) గ్రేడ్-2, ఏఈఈ (AEE) పోస్టులకు చెందిన పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, అందువల్ల నియామకాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ఆయన తెలిపారు. 


ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి సెప్టెంబరు నాటి సీడీపీవో, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లపై ఎలాంటి ఆరోపణలు లేనందున నియామకాలను నిలిపివేయడం సరికాదన్నారు. మూడు నెలల్లోగా ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను ముగించారు.


టీఎస్‌పీఎస్సీ తీరుతో నిరుద్యోగుల్లో అసహనం..
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగ యువతకు టీఎస్‌పీఎస్సీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదైనా ఉద్యోగాలు పొందాలన్న వారి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ పక్క పరీక్షల నిర్వహణ చేతకాక డీలాపడిపోయిన టీఎస్‌పీఎస్సీ, మరోపక్క ఉద్యోగాల నియామకాల్లో కోర్టు కేసులు వెరసి.. నిరుద్యోగ యువత ఓర్పును పరీక్షిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. పేపర్ లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ షెడ్యూలు మారాయి. గ్రూప్-2 పరీక్ష వాయిదాపడింది. గ్రూప్-4 ఫలితాలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి చేరింది. దీంతో ఉద్యోగార్థులో నిరుత్సాహం, అసహనం పెరిగిపోతున్నాయి. 


ALSO READ:


ఎస్‌బీఐలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (Circle Based Officer) పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు-5280, బ్యాక్‌లాగ్ పోస్టులు-167 ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలు ఉన్నాయి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..