బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్.. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు వద్దకు ఈరోజు ఉదయం వెళ్లారు. తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కలిసేందుకే షారుక్ ఇక్కడకు వచ్చారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అయిన తర్వాత తన కుమారుడ్ని షారుక్ కలవడం ఇదే తొలిసారి. ఇటీవల ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ఎన్‌డీపీఎస్‌ కోర్టు రెండు సార్లు కొట్టివేసింది.






కరోనా నిబంధనలను ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఇందులో భాగంగా జైల్ విజిట్ నిబంధనలను కూడా సడలించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇంతకుముందు తమవారిని చూసేందుకు జైలుకు ఎవర్ని అనుమతించేవారు కాదు. ఇటీవల తన కుమారుడితో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ వీడియో కాల్‌లో మాట్లాడారు.


ముంబయి స్పెషల్ ఎన్‌డీపీఎస్ కోర్టు ఆర్యన్ ఖాన్ సహా అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధామేచా బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు.. బాంబే హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం విచారించనుంది.





ఇదీ కేసు..


ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 


ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు. 


విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. సోమవారం అతడిని ముంబయి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతకు ముందే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతూ ఆర్యన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్యన్‌కు బెయిల్‌ను నిరాకరించిన న్యాయస్థానం.. అతనికి అక్టోబర్ 7వ తేదీ వరకూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.


Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'


Also Read: Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి