కరోనాపై యుద్ధంలో భారత్ సాధించిన అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 100 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి భారత్ నవచరిత్ర లిఖించిందన్నారు.
భారత్ నవ చరిత్రను లిఖించింది. 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసానికి, ఐకమత్యానికి ఇది ప్రతీక. భారత శాస్త్రవేత్తల కృషికి ఇది ప్రతిఫలం. 100 కోట్ల టీకా డోసుల పంపిణీ చేసినందుకు దేశానికి శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించినందుకు వైద్యులు, నర్సులకు నా కృతజ్ఞతలు. - ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని మోదీ దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
భారత్ సాధించిన అరుదైన మైలురాయిగా గుర్తుగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. ఎర్రకోట వద్ద మధ్యాహ్నం 12.30కి ఓ గీతాన్ని విడుదల చేయనున్నారు.
ప్రశంసల వెల్లువ..
భారత్ సాధించిన ఈ ఘనతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరక్టర్ డా. పూనమ్ కేత్రపాల్ సింగ్.. భారత్ సాధించిన మైలురాయిపై శుభాకాంక్షలు తెలిపారు.
అతి తక్కువ సమయంలో ఇలాంటి ఘనత సాధించారంటే అది బలమైన నాయకత్వం వల్లే సాధమైందని కేత్రపాల్ అభిప్రాయపడ్డారు.