భారత్‌లో 18 ఏళ్లలోపు వారికి కొవిడ్19 టీకాలకు అనుమతిపై కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ విషయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ డాక్టర్‌ వీకే పాల్‌ అన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని, అయితే పలు దేశాల్లో రెండు డోసులు తీసుకున్న తరువాత కరోనా కేసులు పెరిగాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాస్త్రీయ విషయాలను పరిశీలించిన అనంతరం కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సిన్లపై తుది నిర్ణయం తీసుకుంటుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.


పలు దేశాలలో కరోనా టూ వేవ్స్ వచ్చాయని చెప్పడానికి చింతిస్తున్నానని.. ఇతర దేశాలతో పోల్చితే భారత్ మెరుగ్గా ఉందన్నారు. పండుగలు, చాలా మంది ప్రజలు ఒకేచోట గుమిగూడే ఈవెంట్లు ఇటీవల జరిగాయని.. కొన్ని రోజులపాటు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. విదేశాలలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు, ఆ తరువాత వచ్చిన శాస్త్రీయ ఫలితాలు చెక్ చేసిన తరువాత దేశంలో 18 ఏళ్లలోపు వారికి టీకాలపై నిర్ణయం తీసుకుంటామని వీకే పాల్ పేర్కొన్నారు. 


Also Read: విద్యుత్ కోతలపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలుంటాయి: మంత్రి బాలినేని 


పలు దేశాలు కరోనా టీకాలు సమర్థవంతంగా ఇచ్చినప్పటికీ కొవిడ్19 తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని మరిచిపోకూడదన్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గాయని సంతోషించాల్సిన సమయం కాదని, మరింత జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ల సరఫరా సవ్యంగా జరుగుతోందని.. ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా కరోనా టీకాలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్న కారణంగా కొవిడ్19 మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు.


దేశంలో 18 సంవత్సరాలు దాటిన వారికి కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్ వి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఈ కరోనా వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిన టీకాలు. జైడస్ కాడిల్లా రూపొందించిన జైకోవ్ డి కరోనా వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి దేశంలో అందుబాటులోకి రానున్న తొలి టీకా కానుంది. ఇదివరకే అత్యవసర వినియోగానికి అనుమతి సైతం పొందింది. 


Also Read: రాయలసీమకు నికర జలాలు కేటాయించాలి... సీమ కోసం దిల్లీలో పోరాటం... ఇక రంగంలోకి దిగుతానన్న ఎమ్మెల్యే బాలకృష్ణ 


మరోవైపు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను 2 నుంచి 18 ఏళ్ల వారికి ఇచ్చేందుకు సెంట్రల్ డ్రగ్ అథారిటీ కొన్ని షరతులతో అత్యవసర వినియోగానికి ప్రతిపాదనలు చేసింది. ఒకవేళ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందితే 18 ఏళ్లలోపు వారికి ఇవ్వడానికి జైకోవ్ డీ తరువాత అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్‌ కోవాగ్జిన్ అవుతుంది. లభ్యత, సరఫరా, శాస్త్రీయ అంశాల ఆధారంగా చిన్నారులకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారని వీకే పాల్ వివరించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి