MLA Balakrishna: రాయలసీమకు నికర జలాలు కేటాయించాలి... సీమ కోసం దిల్లీలో పోరాటం... ఇక రంగంలోకి దిగుతానన్న ఎమ్మెల్యే బాలకృష్ణ

ABP Desam   |  Satyaprasad Bandaru   |  17 Oct 2021 04:08 PM (IST)

రాయలసీమకు నీరు అందించేందుకు దిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. సీమ టీడీపీ నేతల సదస్సులో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ

రాయలసీమ ప్రాంతానికి మిగులు జలాలు కాకుండా నికర జలాలు కేటాయించాలని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. నదుల అనుసంధానం జరగాలని బాలకృష్ణ కోరారు. సీమకు నీరు అందించేందుకు దిల్లీలో హర్యానా రైతుల తరహాలో ఉద్యమిస్తామన్నారు. రాయలసీమ ఒక్కప్పుడు రతనాల సీమ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతంగా మారిందని బాలయ్య వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వానికి నీరు ఇవ్వాలని లేదు

రాయలసీమలో పరిస్థితి చూసి హంద్రీనీవాకు అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జోలె పెట్టారని గుర్తుచేశారు. తెలుగు గంగ ద్వారా కొంత వరకు నీటి సమస్యను పరిష్కరించారన్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా హంద్రీనీవా ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వలేకపోయారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 1400 చెరువులకు గాను కేవలం 130 చెరువులకు మాత్రమే నీరు ఇచ్చారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బాలయ్య విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి నీరు ఇవ్వాలని లేదని ఆరోపించారు. నీటి కష్టాలపై ఈ ప్రాంత నేతలతో సంప్రదించలేదన్నారు. కరవు మండలాలకు నీరు వచ్చేలా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని బాలకృష్ణ అన్నారు. 

Also Read: గుర్తులతో గుబులు... దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా..?... ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన

రాయలసీమలో వ్యవసాయం జీవనోపాధి. ఒకప్పుడు రతనాల సీమ ఇప్పుడు కరవుసీమగా ఉండడంతోనే అభివృద్ధికి నాన్న గారు కృషి చేశారు. సీమలో బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి హంద్రీనీవాను తెచ్చారు. మద్రాసుకు నీరు ఇవ్వడానికి తెలుగు గంగను తెచ్చారు. ఈ ప్రభుత్వానికి హంద్రీనీవా నుంచి కనీసం చెరువులకు నీరు అందించే ఆలోచన లేదు. నీరు నిర్విరామంగా ప్రవహిస్తున్న పూర్తి స్థాయిలో చెరువులకు నీరు అందించలేని పరిస్థితి. హంద్రీనీవా కింద ఆయకట్టుకు నీరు ఇవ్వలేదు. గత ఏడాది నీళ్లు వచ్చినా ఇదే పరిస్థితి. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. నీళ్లు ఉన్నా ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. - నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే

దిల్లీలో పోరాటం

బీటీ ప్రాజెక్టుకి, చెరువులకు నీరు ఇవ్వాలని బాలయ్య డిమాండ్ చేశారు. జిల్లాలో అన్ని చెరువులకు నీరు అందించి, కరవు పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి, పెన్నా అనుసంధానం జరగాలని కోరారు. సీమకు నికర జలాలు వినియోగించాలన్నారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తెచ్చేందుకు ఎన్టీఆర్, చంద్రబాబు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేశారని బాలకృష్ణ స్పష్టం చేశారు. సీమ నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామన్నారు. 

Also Read: విద్యుత్ కోతలపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలుంటాయి: మంత్రి బాలినేని

సీమ టీడీపీ నేతల సదస్సు

అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ టీడీపీ నేతల సదస్సు జరిగింది. ఈ సదస్సులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బి.కె పార్థసారథి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ  గుండుమల తిప్పేస్వామి, అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్,  రాయలసీమకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 

Also Read: కేఆర్ఎంబీ పరిధిలోకి ఆ విద్యుత్ ప్రాజెక్టులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 17 Oct 2021 04:08 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.