రష్మిక మందన్నా (Rashmika Mandanna) మీద సౌత్ ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, హిందీకి వెళ్ళామని దక్షిణాది సినిమాలను చిన్న చూపు చూడటం తగదని పేర్కొంటున్నారు. అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... 


రష్మికా మందన్నా నటించిన రెండో హిందీ సినిమా 'మిషన్ మజ్ను' (Mission Majnu Movie). ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా నటించారు. తొలి సినిమా 'గుడ్ బై' కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా. మనిషి మరణం చుట్టూ సాగే కథతో తెరకెక్కించారు.  అందులో రష్మికపై రొమాంటిక్ సాంగ్స్ లేవు. ఓ పబ్ సాంగ్, పార్టీ వైబ్ తరహాలో తెరకెక్కించిన పాటలో ఆమె డ్యాన్స్ చేశారు. 


ఇప్పుడీ 'మిషన్ మజ్ను'లో సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మికపై ఓ రొమాంటిక్ సాంగ్ ఉంది. ఈ మధ్య దానిని విడుదల చేశారు. అప్పుడు రష్మిక సౌత్ సినిమాల్లో పాటలను తక్కువ చేసి మాట్లాడారు. ''చిన్నప్పటి నుంచి నా దృష్టిలో రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. హిందీలో ఎన్నో రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి. సౌత్ సాంగ్స్ మాస్ మసాలా సాంగ్స్. అక్కడ ఐటమ్ సాంగ్స్ ఎక్కువ'' అని రష్మిక మాట్లాడారు. పక్కన ఉన్న సిద్ధార్థ్ మల్హోత్రా, యాంకర్ ''మేం కూడా సామి సామి చూశాం'' అని చెప్పారు. ఇప్పుడు రష్మిక మాటలు సౌత్ సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు, దక్షిణాది ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి. 


విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాలోని 'ఇంకేం ఇంకేం కావాలే...' సాంగ్ రొమాంటిక్ కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రష్మికను ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప : ది రైజ్'లో 'శ్రీవల్లి' కంటే మంచి మెలోడీ ఉంటుందా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. రష్మిక తొలి కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ', తెలుగులో తొలి సినిమా 'ఛలో'లో పాటలు మంచి మెలోడీలు అని, రష్మిక వాటిని మర్చిపోయినట్టు ఉన్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
 
సౌత్ సినిమాల్లో బ్యాన్ చేయాలంటూ...
కన్నడ ప్రేక్షకులు కొందరు రష్మిక అసలు రంగు తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు తెలుస్తుందని అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కొందరు అయితే సౌత్ సినిమాల్లో ఆమెను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 'పుష్ప 2' నుంచి తీయమని ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. 


రష్మికకు వివాదాలు కొత్త కాదు. ఇటీవల తనను కథానాయికగా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు ఓ ఇంటర్వ్యూలో చెప్పనందుకు ఆమెను కన్నడ ప్రేక్షకులు ట్రోల్ చేశారు. 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ'తో ఆమె పరిచయం అయ్యారు. అందులో హీరో, రష్మిక నిశ్చితార్థం చేసుకుని మరీ క్యాన్సిల్ చేసిన రక్షిత్ శెట్టి ఆ సినిమాను నిర్మించారు. హిందీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో రష్మికకు రిషబ్ శెట్టి సెటైర్లు వేశారు. ఆ తర్వాత కన్నడ పరిశ్రమ ఆమెను బ్యాన్ చేసిందని వార్తలు వచ్చాయి. 


Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ ఎలా ఉందంటే?


























ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో రష్మిక వార్తల్లో నిలుస్తున్నారు. అందువల్ల, ఆమెను కొందరు కాంట్రవర్షియల్ క్వీన్ అంటున్నారు. కొంత మంది తనను కావాలని ట్రోల్ చేస్తున్నారని గతంలో రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ విషయాలకు ఎక్స్‌ర్‌సైజ్ చేయడమే అత్యుత్తమ ఔషధం (మంచి మందు) అని ఆమె పేర్కొన్నారు. తన తప్పు ఏమీ లేనప్పటికీ... తనను టార్గెట్ చేస్తూ వస్తున్న ట్రోల్స్, మీమ్స్‌పై ఘాటుగా స్పందించారు. 


కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తనపై కొందరు విషం చిమ్ముతున్నారని, తనను ద్వేషిస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోల్స్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకు తానొక పంచింగ్ బ్యాగ్ కింద మారినట్టు ఆవిడ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తనను ఇష్టపడాలని తాను ఆశించడం లేదని, నటిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విమర్శలు వస్తాయనేది తనకు తెలుసని, దాని అర్థం ద్వేషించమని కాదని రష్మిక స్పష్టం చేశారు. కొన్ని ఇంటర్వ్యూలలో తాను చెప్పిన విషయాలు తనకు వ్యతిరేకంగా మారాయని, ఇతరులతో తన రిలేషన్షిప్స్‌కు హాని కలిగించే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్రోల్స్ మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 


Also Read : మెగాస్టార్ చిరంజీవిలో నటుడ్ని, నటనలో షేడ్స్ అన్నీ ఒక్క వీడియోలో చూపించిన కృష్ణవంశీ