NIA Raids: కేరళలోని 56 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కుట్ర కేసులో భాగంగా ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తోంది. పీఎఫ్‌ఐ సభ్యులతో సంబంధం ఉన్న పలువురు అనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కేరళ పోలీసులతో కలిసి ఈ సోదాలు నిర్వహిస్తోంది ఎన్ఐఏ.
ఆ హత్యలు
ఉగ్రవాద చర్యలు సహా అనేక మంది వ్యక్తుల హత్యలలో PFI కార్యకర్తల హస్తం ఉన్నట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందడంతో ఈ దాడులు చేస్తోంది. 2021 నవంబర్‌లో కేరళలో హత్యకు గురైన సంజిత్, 2019లో తమిళనాడులో వీ రామలింగం, 2021లో కేరళలో నందు హత్య, 2016లో తమిళనాడులో శశికళ కుమార్ హత్యలతో పీఎఫ్ఐ కార్యకర్తలకు సంబంధమున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.
బుధవారం కూడా పీఎఫ్‌ఐకి సంబంధించిన పలు ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు చేసింది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో పీఎఫ్‌ఐ నేతలు టచ్‌లో ఉన్నారని ఎన్‌ఐఏ గతంలో కేరళ కోర్టుకు నివేదిక సమర్పించింది. సభ్యులు రహస్య విభాగాన్ని కూడా నడుపుతున్నారని నివేదిక పేర్కొంది.
అల్‌ఖైదాతో
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంతో ఈ హత్యలు జరిగాయని హోం మంత్రిత్వ శాఖ అంతకుముందు పేర్కొంది. ప్రజల మదిలో భయాందోళనలు సృష్టించేందుకు నేరపూరిత చర్యలు చేపట్టారని ఎంహెచ్‌ఏ పేర్కొంది.
బ్యాన్
దేశంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే అమల్లోకి తెచ్చింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే ఆ సంస్థపై ఈ నిషేధం విధిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కారణంగా పేర్కొన్నారు.
ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ కార్యాలయాలు సహా సభ్యుల ఇళ్లపై వరుస సోదాలు నిర్వహించింది. ఎన్ఐఏ పలువురు పీఎఫ్ఐ లీడర్లను అరెస్టు కూడా చేసింది.
పీఎఫ్ఐ అంటే
అణగారిన వర్గాల సాధికారతే తమ లక్ష్యం అని చెప్పుకుంటూ కేరళ కేంద్రంగా 2006లో పీఎఫ్ఐ ఏర్పాటు అయింది. ఇప్పుడు దిల్లీలో హెడ్ ఆఫీసు ఉంది. అణగారిన వర్గాల కోసం పని చేస్తున్నామని పీఎఫ్ఐ చెప్పుకుంటున్నా.. ఎన్ఐఏ, ఐబీ లాంటి కేంద్ర భద్రతా సంస్థలు మాత్రం మరోలా చెబుతుంటాయి. అతివాద ఇస్లాంను పీఎఫ్ఐ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నాయి.
పీఎఫ్ఐపై ఇలా కేసులు నమోదు కావడం ఇదేం కొత్త కాదు. 2020లో పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనల సమయంలో చాలా కేసులు పీఎఫ్ఐపై నమోదయ్యాయి. పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు, 2020 ఢిల్లీ అల్లర్లు, యూపీ హాథ్రాసో దళిత బాలికపై గ్యాంగ్ రేప్ వ్యవహారంలో కుట్ర లాంటి ఇంకా వేర్వేరు సందర్భాల్లో పీఎఫ్ఐ ఆర్థికంగా మద్దతు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి