Covid-19 In India:
40 రోజులు భద్రం..
కరోనా మహమ్మారి మరోసారి భారత్ లో తన విశ్వరూపాన్ని చూపించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. జనవరి నెలలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకు ముందు కేసులు పెరిగిన విధానాన్ని పరిశీలించి ఈ విషయం వెల్లడించారు. రానున్న 40 రోజులు చాలా కీలకమని ,అందరు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. "గతంలో తూర్పు ఆసియా లో వ్యాప్తి చెందిన 30-35 రోజుల తర్వాత కరోనా కొత్త వేవ్ భారత్ లోకి ప్రవేశించింది. ప్రతిసారి ఇదే కొనసాగింది" అని ఓ కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి తెలిపినట్టు వార్త సంస్థ PTI పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసి భారత్ కు వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి కరోనా పరీక్షలు తప్పనిసరి అని గత శనివారం కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం , గత రెండు రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన 6000 మంది ప్రయాణికులను పరీక్షించగా ,39 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఢిల్లీ విమానాశ్రయాన్ని సందర్శించి టెస్టింగ్,స్క్రీనింగ్ ఏర్పాట్లను పరిశిలించారని అధికారులు తెలిపారు.
బీఎఫ్-7 వేరియంట్ గుబులు..
చైనా,దక్షిణకొరియా ,హాంగ్ కాంగ్ ,బ్యాంకాక్ ,సింగపూర్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 'ఎయిర్ సువిధ' ఫామ్ లను నింపడం ,RT-PCR టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి చేశారు. వచ్చే వారం కూడా ఇది కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రులు,వైద్యుల సంసిద్ధతను తెలుసుకోవడానికి మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. దేశమంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ తెలిపారు. చైనాలో అకస్మాత్తుగా కేసుల పెరుగుదలకు కారణం ఓమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఎఫ్ - 7 వేరియంట్. దీనికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో కేసులు గణనీయంగా పెరిగాయి. బీఎఫ్ -7 సోకినా ఒక్క వ్యక్తి మరో 18 మందికి వ్యాప్తి చేసే అవకాశం ఉంది అని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించడంతో కేంద్రం రాష్ట్రాలను,కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.
విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా..
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టెస్ట్‌లు భారీ సంఖ్యలో చేస్తున్నారు. ఈ క్రమంలోనే 13 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో నేరుగా ఎయిర్‌పోర్ట్ నుంచి ఆసుపత్రికి తరలించారు. వారికి కరోనా సోకిందేమో అన్న అనుమానం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన వెంటనే వాళ్ల వైరస్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈ 13 మంది ప్రయాణికులు రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్లు. వీళ్లను అసింప్టమేటిక్‌గా అనుమానిస్తున్నారు అధికారులు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఎవరినీ వదలకుండా నిత్యం టెస్ట్‌లు చేస్తూనే ఉన్నారు. వీటితో పాటు ప్రతి ఒక్క ప్రయాణికుడు కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు చేపడుతున్నారు.
Also Read: Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్లకూ ఇది అవసరమా?