TS Congress Seniors :  గాంధీ భవన్‌లో జరిగిన  కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు తప్పించి సీనియర్లెవరు కనిపించలేదు. దీంతో మరోసారి సీనియర్ల అసమ్మతిపై చర్చ ప్రారంభమయింది. కావాలనే డుమ్మా కొట్టారా లేదంటే అధ్యక్షుడి ఆదేశాలతోనే జిల్లాలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశ ఐక్యత కోసం ఓ వైపు యువనేత రాహుల్‌ గాంధీ జోడోయాత్ర చేస్తుంటే రాష్ట్ర నేతలేమో ఎవరికి వారే లీడర్లు అన్నట్లు ప్రవర్తించడమే కాదు పదవుల కోసం తన్నుకుంటున్నారు. 


తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఐక్యత రాలేదా ? 


ఐక్యత లోపించిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వ్యవహారం మరోసారి పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా చర్చకు దారితీస్తోంది. పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఢిల్లీలో ఘనంగా జరిపారు. జోడోయాత్రలో ఉన్న రాహుల్‌   ఢిల్లీలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం ఎప్పటిలాగానే ఐక్యత లోపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాంధీభవన్‌ లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో సీనియర్లెవరూ కనిపించకపోవడంతో భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పాటు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వంటి ఒకరిద్దరు సినీయర్లు తప్పించి మిగిలిన నేతలెవరూ కనిపించలేదు. 


దిగ్విజయ్ సూచనలతో అందరూ సైలెంట్ అయ్యారా? 


కొద్దిరోజుల క్రితమే రేవంత్‌ కి వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్లంతా మూకుమ్మడి నిరసనకు దిగారు. దీంతో ట్రుబుల్‌ షూటర్‌ దిగ్విజయ్‌ వచ్చి నేతలకు సర్దిచెప్పి వెళ్లారు. అయితే పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదనడానికి ఆవిర్భావ వేడకలే నిదర్శనమని కొందరి వాదన. రేవంత్‌ తో తాడో పేడో తేల్చుకునేవరకు తగ్గేదేలే అని సీనియర్లు దిగ్విజయ్‌ కి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే ఈ వేడుకలకు దూరంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇందులో నిజం లేదని పార్టీ క్యాడర్‌ అంటోంది. రేవంత్‌ రెడ్డి సూచన మేరకే ఆయా జిల్లాల్లో నేతలు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారని చెబుతున్నారు. భట్టి విక్రమార్క తన జిల్లాలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు దిగ్విజయ్‌ సూచన మేరకు సీనియర్లెవరూ ఇక బహిరంగంగా పార్టీలోని అసమ్మతిని బయటపెట్టరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌ను మార్చే చాన్స్ 


ఇంకోవైపు సీనియర్ల అసంతృప్తిని తగ్గించేందుకు  అధ్యక్షుడిని మార్చే కన్నా ఇంచార్జ్‌ ని మార్చడం ఉత్తమమని అధిష్టానం భావిస్తోందట. ఇప్పటికే దిగ్విజయ్‌ తో చర్చలు జరిపిన హైకమాండ్‌ త్వరలో తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ గా ఓ దళిత నేతని నియమించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనే ఈ ఇంఛార్జ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకుంటారని టాక్‌.జనవరి 26నుంచి రేవంత్‌ రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. మరి ఈ యాత్రని సీనియర్ల సహకారంతో పూర్తి చేస్తారా లేదంటే ఒంటరిగానే యాత్రకి దిగుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.