TDP Target Youth And Womens :   తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. వంద నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర లక్ష్యం.. మహిళలు, యువతను పార్టీకి దగ్గర చేసుకోవడమే. ప్రస్తుత రాజకీయాల్లో గెుపోటముల్ని నిర్ణయించేది యువత, మహిళలే. ఓటింగ్ కు ఉత్సాహంగా వచ్చేది కూడా వారే. ఆ వర్గాలను ఆకట్టుకుంటే చాలా వరకూ గెలుపు సులువు అవుతుంది. అందుకే టీడీపీ యువనేత లోకేష్ వ్యూహాత్కమంగా ఆ రెండు వర్గాలను టార్గెట్ చేసుకుని పాదయాత్ర చేయాలని సంకల్పించారు. 


ఏపీ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం !


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా చైతన్యవంతమైన యువత ఎక్కువ. ఏ ఇద్దరు యువత కలిసినా రాజకీయాలపై చర్చించుకుంటారు. దాదాపుగా అందరికీ రాజకీయ పరమైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇంతటి చైతన్యం ఉన్న ఏపీలో యువత మద్దతు పొందడం క్లిష్టం.  గెలవాలంటే వారి మద్దతు పొందాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ యువత కోసం చాలా కార్యక్రమాలు చేసినట్లుగా చెప్పుకున్నా  పూర్తిగా యువత ఆదరించలేదు. వైసీపీ స్ట్రాటజిస్టుల వ్యూహం కారణంగా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో   టీడీపీకి మైనస్ అయిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు  నారా లోకేష్ యువతపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. వారిని మళ్లీ టీడీపీ వైపు ఆకర్షించేందుకు తన పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. 


యువ ఆలోచనలకు ప్రతీకగా లోకేష్ !


నారా లోకేష్ ఇంకా  ముఫ్పైల్లోనే ఉన్నారు. ఆయన ఇంకా నలభైకి చేరుకోలేదు. కానీ ఇప్పటికే రాజకీయంగా ఎంతో అనుభవం సంపాదించారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన తర్వాత ఆయన టీడీపీకి పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమాన్ని ఆయనే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 2009 ఎన్నికల్లో  టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశం నగదు  బదిలీ. దీన్ని నారా లోకేష్ డిజైన్ చేశారు.  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని అప్పట్లో లోకేష్ పార్టీ మేనిఫెస్టోలో ఉండేలా చూశారు. అప్పట్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ నగదు  బదిలీ విధానం పక్కకుపోయింది. అయితే అప్పట్నుంచి ఆయన టీడీపీ కోసం శ్రమిస్తూనే ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి..  ఐటీ , పంచాయతీరాజ్ మంత్రిగా తనదైన ముద్ర వేశారు. మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ... ఓటమే విజయానికి తొలి మెట్టు అని మంగళగిరిలోనే విస్తృతంగా పని చేస్తున్నారు. లోకేష్ ఇమేజ్ ఓ రకంగా మైనస్ లో నుంచి ప్రారంభమయింది. ఇప్పుడు ఆయన యువతను ఆకట్టుకుంటున్నారు. పాదయాత్ర ద్వారా యువతకు మరింత దగ్గర కావాలనుకుంటున్నారు. 


టీడీపీలో ఈ సారి తెరపైకి యువతరమే !


తెలుగుదేశం పార్టీలో ఈ సారి పూర్తిగా తెరపైకి యువతరమే రానుంది. లోకేష్, రామ్మోహన్, పరిటాల శ్రీరాం లాంటి వాళ్లు ఇప్పటికే స్పీడ్‌మీద ఉన్నారు. వారసులు మాత్రమే కాకుండా..  కింది స్థాయి నుంచి ఎదిగిన యువ నేతలకు ఈ సారి చంద్రబాబు, లోకేష్ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సహజంగా టీడీపీకి యువతలో మంచి ఆదరణ ఉంటుంది. అభివృద్ధి రాజకీయాలు ఓ కారణం అయితే.. ఐటీ, పరిశ్రమల స్థాపనలో టీడీపీ ప్రభుత్వం చురుకుగా ఉంటూండటం మరో కారణం. అందుకే ఈ సారి యువ నేతలు తెరపైకి రానున్నారు. 
 


మహిళల మద్దతు కొనసాగేలా చేసుకోవాలని టీడీపీ ప్లాన్ !


తెలుగుదేశం పార్టీకి మహిళల మద్దతు మొదటి నుంచి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతూంటారు, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి.. లక్షల మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపామని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే ఈ సారి పాదయాత్ర ద్వారా  వారి మద్దతు కొనసాగేలా చూసుకుని..యువత, మహిళల మద్దతుతో టీడీపీని అధఇకారంలోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో లోకేష్ ఉన్నారు.