జగన్ ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్న యువతకు ప్రశ్నించే వేదిక కల్పించేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. దీనికి యువ గళం అనే పేరు పెట్టారు. ఈ యాత్ర జనవరి 27న ప్రారంభం కానుంది. ఏబీపీ దేశం ముందుగానే చెప్పినట్టు.. లోకేష్‌ యువ గళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభం కానుంది. నాలుగు వందల రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగనుంది. 


చాలా నిరాడంబంరంగా యువ గళం పాదయాత్ర సాగుతుందని ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. యువతను ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. వారి భవిష్యత్‌ కోసం ప్రణాళికలు రూపొందించేందుకేందుకే ఈ యాత్ర చేస్తున్నట్టు వివరించారు. నిరుద్యోగ యువతకు ఓ ప్లాట్ ఫామ్ ఇచ్చేందుకు లోకేష్‌ పాదయాత్రకు సిద్ధమయ్యారన్నారు. జగన్ వచ్చిన తర్వాత మూడున్నరేళ్లపాటు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలతోపాటు అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారన్నారు. వారందర్నీ కలిసేలా వారి సమస్యలు తెలుసుకునేలా యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. 


జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలా సిని హంగులతో ఈ పాదయాత్ర ఉండబోదని చాలా సింపుల్‌గా ఉంటుందన్నారు అచ్చెన్న. యువత ఉజ్వల భవిష్యత్‌ కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను జగన్ సర్కారు రద్దు చేసిందని.. దీని వల్ల అన్ని వర్గాల ప్రజల్లో అసహనం ఉందన్నారు. వారిందర్నీ కలిసి వారి భవిష్యత్ బాగు కోసం చేసే ఆలోచనలు, పంచుతూ... వారి ఆలోచనలు తీసుకుంటామన్నారు. ఏపీలో అన్ని  వర్గాలు ఈ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఉన్నారన్నారు...నాలుగు రోజులకో యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని తెలిపారు. వీటిని గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. 






మహిళలపై వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు అచ్చెన్న. రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మాదకద్రవ్యంతో యువత నాశనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా మూలాలు ఏపీ వైపే చూపిస్తున్నాయని దీన్ని నియంత్రించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు. దీని వల్ల నిరుద్యోగం పెరిగిపోతోందని... ఈ సమయంలో యువత భవిష్యత్‌ను బాగు చేసేందుకు యువ గళం పాదయాత్ర సాగుతుందన్నారు. 


ప్రస్తుతం తాము అధికారంలో లేమని... సమస్యలు తెలుకోవడం వాటి పరిష్కార మార్గాలను అన్వేషించడానికే  యాత్ర చేస్తున్నట్టు అచ్చెన్న వివరించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా, ప్రజలకు అండగా ఉండే పార్టీగా.. యువతకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నామన్నారు. యువత పోరాటాలు చేయడానికి వేదిక ఇచ్చేందుకు ఈ యాత్రన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువత ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.