ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయా పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధికార పార్టీ గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు చేపడుతుంటే... మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ తెలుగుదేశం పోటీగా పోరాటాలు చేస్తోంది. చంద్రబాబు ఇప్పటికే చాలా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకుని... అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు.
 


యువ గళం పేరుతో యాత్ర


జనవరి 27 నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి యువ గళం పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. లోకేష్ చేపట్టే పాదయాత్ర నాలుగు వందల రోజుల పాటు సాగనుంది. అంటే షెడ్యుల్‌ ప్రకారం ఎన్నికలు జరిగితే అప్పటి వరకు యాత్ర కొనసాగుతుంది. 


నాలుగు వందల రోజులు- వంద నియోజకవర్గాలు


400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగనుంది లోకేశ్ పాదయాత్ర. వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్‌ మ్యాప్‌ రెడీ చేశారు. లోకేష్ తన పాదయాత్రలో యువత, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి పరిష్కార మార్గాలను సూచించనున్నారు.


పాదయాత్ర చేస్తే అధికారం ఖాయమా!


తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఓ బెంచ్ మార్క్‌లా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల్లో ఉండటానికి .,.  అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడానికి యాత్రలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. అది విడతల వారీగా సాగుతోంది. ఇప్పటికే ఐదు విడతలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్ యాత్ర నిర్విరామ యాత్రకు సిద్ధమవుతున్నారు. 


నేడు అధికారిక ప్రకటన


లోకేష్ పాదయాత్ర చేస్తారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా యాత్ర ఖాయమన్న సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చారు. ఇవాళ అధికారికంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. దీనికి తగ్గట్టుగానే రూట్ మ్యాప్ సిద్ధమైంది. 


యువతను ఆకట్టుకునే లక్ష్యంతో లోకేష్ పాదయాత్ర


నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం కామన్‌గా మారింది. గతంలో అయితే చంద్రబాబుతో పాటు జగన్ జైలులో ఉండటం వల్ల...  షర్మిల పాదయాత్ర చేశారు. కానీ షర్మిల పాదయాత్ర వైసీపీకి విజయం లభించలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున వారానికి ఆరు రోజుల పాదయాత్రే చేశారు. అయినప్పటికీ  ఆయన ఘన విజయం సాధించారు.