టీడీపీ అధినేత చంద్రబాబు మనుషులు ఒక గూడుపుఠాని సమావేశం జరిపారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ప్రజా స్వామ్యం ఖూనీ అయిపోతుందన్న టీడీపీ నాయకులకు నిజంగా స్వేచ్ఛ లేకపోతే ఇలా బరితెగించి మాట్లాడేవారా అని ప్రశ్నించారు.


టీడీపీ రౌండ్ టేబుల్ పై వైసీపీ మండిపాటు... 
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం - ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు పేరిట టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని మాట్లాడుతున్నారని, నిజంగా ఏపీలో స్వేచ్ఛ  లేకపోతే  మీరు  బరితెగించి మాట్లాడేవారా అని నాని ప్రశ్నించారు. సభ్య  సమాజం ఒప్పుకునే భాష మీరు మాట్లాడుతున్నారా అని టీడీపీ నేతలను నిలదీశారు. టీడీపీ నేతలు అన్ని అసత్య ప్రచారాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు.


చంద్రబాబు దగ్గర ఇప్పుడు అందరూ చేరి నానా  రకాలుగా మాట్లాడుతున్నారని, దొంగలంతా  కలిసి ఒకే  గొడుగు కిందకు వస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్నినాని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు సింగల్ గా వెళ్ళే దమ్ము లేకపోవటంతో, ఇతర రాజకీయ పార్టిలను కలుపుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు. 2014 - 19మధ్య చంద్రబాబు పాలన తరహాలోనే మరలా పాలన సాగిస్తానని చంద్రబాబు ఎందుకు ప్రకటించటం లేదని ప్రశ్నించారు. రాజకీయంగా టీడీపీ ముందుకు సాగలేని దుస్థితిలో ఉండటంతో మిగిలిన పార్టీల వెంట పడుతుందని ఎద్దేవా చేశారు.


కమ్యూనిస్టుల్లో కమ్యూనిజం ఉందా... 
చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న కమ్యూనిస్టుల తీరుపై మాజీమంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. అసలు కమ్యూనిస్టుల్లో నిజంగా కమ్యూనిజం ఉందా అని ప్రశ్నించారు. కమ్యూనిజం ఆవిరి అయిపోయిందని, అందుకనే చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. కమ్యూనిస్టులు కోరేది ఉండడానికి  ఇళ్ల  స్థలాలు, తినడానికి తిండి అన, ఒక్క రోజైనా కమ్యూనిస్టులు ఈ ప్రభుతాన్ని కానీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కానీ  మెచ్చుకున్నారా అని ప్రశ్నించారు. పేదలకు  ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డు పడ్డ మీరా కమ్యూనిస్టులు అని ప్రశ్నించారు. ఒక కులానికి రాజధాని అని సీపీఐ రామకృష్ణ ఇతర నేతలు మాట్లాడారని, అయితే వెంటనే ప్లేట్  మార్చారని విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పని చేస్తున్న పార్టీలన్నీ కలసి సీఎం జగన్ పై దండయాత్ర చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.


చంద్రబాబును వెంటాడుతున్న ఎన్టీఆర్ ఆత్మ....


చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలే ఆయనకు శాపమవుతున్నాయని పేర్నినాని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ ఇంకా ఘోషిస్తూనే ఉందని, అది ఇప్పటికీ చంద్రబాబును వెంటాడుందని వ్యాఖ్యానించారు. జగన్ తాను చేసింది చెప్పి, ఓట్లు అడుగుతున్నారని.. చంద్రబాబు ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న పార్టిలన్నీ రాజకీయాల కోసమే వ్యవహరాలు చేస్తున్నాయని, ప్రజల కు అందుతున్న సంక్షేమంపై ఏనాడయినా వాకబు చేశారా అని నిలదీశారు. సీఎం జగన్ కు ఓటు వేసి తప్పు చేశామనే భావనలో ప్రజలు ఉన్నారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు స్దానిక సంస్దల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలు తరవాత స్థానిక ఎన్నికలు జరిగాయన్న విషయాన్ని మర్చిపోయారా అని చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు.