ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా గెలుపు బీఆర్ఎస్ దేనని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా మార్చిన తరువాత జైత్రయాత్రకు మునుగోడుతో బోణీ అయిందని, సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో గెలుపు బీఆర్ ఎస్ జోరుకు నిదర్శనంగా నిలిచిందని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విజయాలు కేసీఆర్ అద్భుత నాయకత్వానికి ప్రజలు ప్రధానం చేస్తున్న కీర్తి కిరీటాలు అన్నారు.
కేటీఆర్ నాయకత్వానికి ఈ విజయాలు నిదర్శనం
మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదునైన నాయకత్వానికి ఈ విజయాలు నిలువెత్తు నిదర్శనమని ఆయన తెలిపారు. ఇక ముందు కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ దెబ్బకు విపక్షాలు విలవిలలాడక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజా పక్షమేనని, వారికి మేలు చేయడానికి ఎన్ని కష్టాలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా బీఆర్ ఎస్ ధాటికి బీజేపీ పరార్ కావడం ఖాయమని, కాంగ్రెస్ ఓటమి ఖరారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ అవినీతికర, అవకాశవాద, దగాకోరు విధానాలతో దేశాన్ని భ్రస్టు పట్టించిందని, మోడీ ఎనిమిదేళ్ల పాలన దేశాన్ని చీకటి మయం చేసిందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ ఎస్ ఆయుధాలని ఆయన అన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ, చెరువులు బాగుచేసిన మిషన్ కాకతీయ, రూ.2016, రూ.3016 చొప్పున ఇస్తున్న ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి అపురూప పథకాల సమాహారం తెలంగాణ మోడల్ దేశాభిమానం పొందుతున్నదని ఆయన తెలిపారు.
మోసం తప్ప జనం గోస పట్టని మోడువారిన "మోడీ మోడల్" దేశానికి హానికరమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. సబ్బండ వర్గాల అండదండలే కేసీఆర్ కు శక్తి పీఠాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక అమ్మకం పార్టీ అని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నదని,కాంగ్రెస్ ఒక అపనమ్మకపు పార్టీ అని, వయోభారంతో కాటికికాలుజాపిన ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ ఎస్ గెలుపు తోనే దేశానికి మలుపు అని, యావత్తు దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి పునరుద్ఘాటించారు.
సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను పట్టం కట్టిన ఓటర్లు మంత్రి కేటీఆర్ నాయకత్వం పై అచంచల విశ్వాసం కనపర్చారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అఖండ విజయం చేకూర్చిన ఓటర్లకు జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.