Kamareddy News : కామారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల మృతి కేసులో కన్న తల్లే దోషిగా తేలింది. బాన్సువాడ టౌన్ లో సోమవారం రాత్రి వెలుగు చూసిన ఇద్దరు చిన్నారుల మృతి కేసులో కన్న తల్లే వారిని చంపినట్లు తేలింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అరుణను మహారాష్ట్రలోని ఉద్గిర్ కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి నాలుగేళ్ల కొడుకు, ఆరు నెలల కూతురు ఉంది. కుటుంబ కలహాలతో కొద్దిరోజులుగా తల్లి ఇంటిలో ఉంటుంది అరుణ. సోమవారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకొని బస్సులో బాన్సువాడకు వెళ్లింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో వాగు కాల్వలో ఇద్దరు పిల్లలను పడేసి తాను దూకింది. లోతు తక్కువగా ఉండడంతో అరుణ చనిపోలేదు. ఇద్దరు పిల్లలను కొద్దిసేపటి తర్వాత బయటకు తీసుకొచ్చింది. అయితే అప్పటికే పిల్లలు చనిపోయారు. పిల్లలను ఓ ఆటో డ్రైవర్ పడేసినట్లు పోలీసులకు చెప్పింది. అరుణను పోలీసులు విచారించారు. చివరకు చిన్నారులిద్దరిని తానే వాగులో పడేసినట్లు ఒప్పుకుంది నిందితురాలు అరుణ. దీంతో పోలీసులు అరుణను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
అసలేం జరిగింది?
క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. చిన్న చిన్న తగాదాలు మనస్పర్థలతో ఆత్మహత్యలు చేసుకుంటూ నవమాసాలు మోసి కన్న బిడ్డలను కూడా కడతేర్చుతున్నారు. సోమవారం రాత్రి బాన్సువాడలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న పెద్ద పూలు వాగులో ఇద్దరు చిన్నారులను నీటిలో పడవేసిందో తల్లి. తర్వాత తాను చనిపోదామని అనుకుని వాగులో దూకింది. లోతు తక్కువగా ఉండడంతో ఆమె చనిపోలేదు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ తాలూకాలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ అరుణ తన తల్లి ఇంటిలో ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలోని నాగారం గొల్లగట్టు తండా నుంచి పిల్లలను యువరాజ్(4), అనన్య(6 నెలలు) పాపతో కలిసి బాన్సువాడలోని బస్ డిపో సమీపంలో గల పెద్ద పూలు బ్రిడ్జి వద్ద వాగులో దూకింది. వాగు లోతు తక్కువగా ఉండడంతో అరుణ బతికిబయటపడింది. వాగులో మునిగి ఇద్దరు చిన్నారులు చనిపోయారు.
ఆటో డ్రామా
ఈ కేసుపై డీఎస్పీ జగన్నాథ రెడ్డి మాట్లాడుతూ... పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అరుణ ఆటో డ్రామాకు తెరలేపడంతో అన్ని కోణాల్లో కేసును విచారించమన్నారు. ఈనెల 24న జాదవ్ అరుణ సోదరుడు తిరుపతికి వెళ్లి తిరిగి రావడంతో అరుణ తల్లి గారింటికి నిజామాబాద్ రావడం జరిగిందన్నారు. సోమవారం రోజున ఆమె భర్త మోహన్ ఇంటికి రమ్మని చెప్పడంతో అరుణ నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో బాన్సువాడకు వచ్చిందన్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ లను సాక్ష్యాధారాలను బట్టి అరుణ బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వచ్చి బస్సు డిపో వద్ద గల నారాయణరెడ్డి బోర్వెల్ కార్యాలయం వైపు వెళుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయిందన్నారు. అలాగే చేపూరి బార్ అండ్ రెస్టారెంట్ సీసీ టీవీ ఫుటేజ్ లో వాగు వైపు వెళ్తున్నట్లు కనిపించడంతో దర్యాప్తును అన్ని కోణాల్లో చేసినట్లు తెలిపారు. అరుణను విచారించగా తానే పిల్లలను చంపినట్లు నేరాన్ని ఒప్పుకుందన్నారు. దీంతో అరుణను అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు. కేసులో ఆధునిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.