India vs SL Series:  జనవరిలో స్వదేశంలో టీమిండియా, శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది. జనవరి 3 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం ఈ రోజు భారత జట్టును ప్రకటించనున్నారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శ్రీలంకతో టీ20 ల నుంచి విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీని గురించి బీసీసీఐకు కోహ్లీ సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. అయితే అతను తిరిగి ఎప్పుడు టీ20లకు అందుబాటులో ఉంటాడో సమాచారం లేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2023 ముందు వరకు విరాట్ టీ20లు ఆడకపోవచ్చని తెలుస్తోంది.


నేడు శ్రీలంకతో టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. ఈ సెలక్షన్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడని సమాచారం. టీ20ల నుంచి స్వల్ప విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తాను టీ20 సిరీస్ కు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐకు కోహ్లీ చెప్పినట్లు సమాచారం. అయితే వన్డేలకు అతను తిరిగి వస్తాడు. కోహ్లీ ఎప్పటివరకు అందుబాటులో ఉంటాడో తెలియదు కానీ.. ముఖ్యమైన సిరీస్ లకు మాత్రం తిరిగివస్తాడని బీసీసీఐ వర్గాల సమాచారం.


టీ20లకు బ్రేక్!


'అవును. తాను టీ20లకు అందుబాటులో ఉండడని కోహ్లీ మాకు తెలియజేశాడు. వన్డే సిరీస్ కు రానున్నాడు. టీ20ల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడా లేక లంకతో సిరీస్ కు మాత్రమే బ్రేక్ తీసుకున్నాడా అనేది ప్రస్తుతానికి తెలియదు. అయితే ముఖ్యమైన సిరీస్ ల కోసం కోహ్లీ బీసీసీఐ ప్లాన్ లో ఉన్నాడు. ఇక రోహిత్ విషయానికొస్తే.. అతను ఆడడం గురించి మేం తొందరపడడంలేదు. హిట్ మ్యాన్ ఫిట్ గా ఉన్నాడా లేదా అనేది త్వరలో తెలుస్తుంది. అతను బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. అయితే ఫీల్డింగ్ విషయంలో మేం రిస్క్ తీసుకోం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బంగ్లాతో వన్డే సిరీస్ లో రోహిత్ ఎడమచేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. 


టీ20 రీబూట్


శ్రీలంకతో టీ20లకు హార్దిక్ పాండ్య జట్టును నడిపించనున్నాడు. ఈ సిరీస్ లో చాలామంది సీనియర్లకు స్థానం లభించదని తెలుస్తోంది. జడేజా, బుమ్రా, పంత్, భువనేశ్వర్, కేఎల్ రాహుల్ లు టీ20లకు అందుబాటులో ఉండరని సమాచారం. ప్రస్తుతం 2024 టీ20 ప్రపంచకప్ కోసం జట్టును నిర్మించే పనిలో బీసీసీఐ ఉంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.