Ramiz Raja on Najam Sethi:


పీసీబీ నూతన మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా విమర్శలు కురిపించాడు. సీజన్‌ మధ్యలో అకారణంగా తనను తొలగించారని ఆరోపించాడు. ఆఫీస్‌ నుంచి తన సమాగ్రి తెచ్చుకోనివ్వడం లేదని వెల్లడించాడు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి కోసం పీసీబీ రాజ్యాంగాన్ని మార్చేశారన్నాడు. అనుభవజ్ఞుడైన సక్లెయిన్‌ ముస్తాక్‌ను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాగైతే పాకిస్థాన్‌ క్రికెట్‌ పెద్ద జోక్‌గా మారుతుందని హెచ్చరించాడు. తన యూట్యూబ్‌ ఛానళ్లో రమీజ్‌ మాట్లాడాడు.


పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులో ఈ మధ్యే అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి రమీజ్‌ రాజాను తొలగించారు. కోచ్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ను పక్కకు నెట్టేశారు. నజమ్‌ సేథీ తిరిగి పీఠం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసు ఓటమితోనే ఇలా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల ఒప్పందంతో వచ్చిన రమీజ్‌ను మధ్యలోనే గెంటేయడం వెనక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి.


'ఒక వ్యక్తి కోసం, కచ్చితంగా చెప్పాలంటే సేథీ కోసం పీసీబీ రాజ్యంగం మొత్తం మార్చేశారు. ఇలా చేయడం ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. ఇప్పుడిప్పుడే పాక్‌లో విదేశీ జట్లు పర్యటిస్తుంగా అదీ సీజన్ మధ్యలో చేశారు. టెస్టు క్రికెట్‌ అనుభవం ఉన్న చీఫ్‌ సెలక్టర్‌ను మార్చేశారు. రమీజ్‌ రాజా వెళ్లిపోయాడని రాత్రి 2 గంటలకు నజీమ్‌ సేథీ ట్వీట్‌ చేశాడు. ఇది నా ఆట స్థలం. ఇలా చేయడం బాధ కలిగించింది' అని పీసీబీ మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ అన్నాడు.


'పాకిస్థాన్‌ క్రికెట్‌ను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మళ్లీ వచ్చినంత బిల్డప్‌ ఇస్తున్నారు. ఆయనేంటో అందరికీ తెలుసు. ఏదేమైనా సరే ఎప్పుడూ వార్తల్లో ఉండాలన్నదే అతడి యావ. క్రికెట్‌కు అతడేమీ చేయలేదు. కనీసం బ్యాటూ పట్టుకోలేదు. సక్లెయిన్‌ ముస్తాక్‌ పదవీకాలం ఎలాగూ జనవరిలో ముగుస్తుంది.  కానీ సీజన్‌ మధ్యలోనే మికీ ఆర్థర్‌ను తీసుకొస్తున్నారు. సక్లెయిన్‌కు 50 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అతడో దిగ్గజం. ఆటగాళ్లతో ఇలా ప్రవర్తించడం తగదు' అని రమీజ్‌ పేర్కొన్నాడు.


'మూడేళ్ల పదవీ కాలం ఉన్నప్పుడు మధ్యలోనే 12 నెలలకే తప్పిస్తే చిరాకు వస్తుంది. రాజకీయ సంబంధాలున్న వ్యక్తి కోసమే ఇలా చేశారు. ఇది క్రికెట్‌కు సాయపడదు. రాజ్యాంగం పటిష్ఠంగా ఉండాలి. పాకిస్థాన్‌లోనే ఇలా జరుగుతుంది. అంతర్జాతీయ వేదికల్లో నేను దీనిపై మాట్లాడుతూనే ఉంటా. పాక్‌ క్రికెట్‌ జోక్‌గా మారింది. వాళ్లు ఆఫీస్‌ నుంచి కనీసం నా సామగ్రినీ తీసుకెళ్లేందుకు అనుమతివ్వడం లేదు. ప్రభుత్వం పీసీబీ రాజ్యాంగాన్ని కూల్చేసింది. వాళ్లకు క్రికెట్‌పై ఆసక్తి లేదు. కొనసాగించడం లేనప్పుడు నైపుణ్యానికి తావుండదు' అని రమీజ్‌ అన్నాడు.


టీమ్‌ఇండియా, బీసీసీఐపై అవాకులు చవాకులు పేలిన రమీజ్‌ రాజా పరిస్థితి చివరికి ఇలాగైంది!