India Squad SL Series: జనవరి 3 నుంచి శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయలేదు. కాబట్టి పాత కమిటీయే ఈ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేస్తుంది. టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక  చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సిరీస్‌లో ఏఏ ప్లేయర్లకు అవకాశం వస్తుందో అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది. 


టీమిండియా చివరిసారిగా న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఆడగా, హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. చాలా మంది యువ ఆటగాళ్లకు అప్పటి జట్టులో స్థానం లభించింది. మరి ఇప్పుడు శ్రీలంకతో జరిగే సిరీస్‌ కోసం సెలెక్షన్ కమిటీ ఎలాంటి జట్టును ఎంపిక చేస్తుందో అన్న చర్చ నడుస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే జట్టులో కొన్ని మార్పులు ఉండవచ్చని అంతా భావిస్తున్నారు. ఇందులో రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని టాక్. అదే సమయంలో రాహుల్ త్రిపాఠిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.


టీ 20 జట్టు ఇలా ఉండొచ్చు


హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.


వన్డే సిరీస్ గురించి చర్చిస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ సాధించాడు. అందుకే మళ్లీ ఆయన వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడిన టీంలోని సభ్యులను ఎక్కువ మందిని కొనసాగించవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వారిలో పేలవమైన ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌కు శ్రీలంక టూర్‌కు రెస్ట్‌ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతనితోపాటు కుల్దీప్ సేన్‌కి కూడా జట్టులో స్థానం లభించకపోవచ్చు. 


వన్డే జట్టు ఇలా
ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం శ్రీలంకతో ఆడే వన్డే టీం కూర్పు ఇలా ఉండవచ్చు. 
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.


బంగ్లాదేశ్‌ టూర్‌ తర్వాత టీమిండియా, సెలక్షన్ కమిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పేలవమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఇంకా కొనసాగించడం ఏంటని ఇంటాబయట ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రిజర్వ్‌ బెంచ్‌లో చాలా మంది టాలెంటెడ్‌ ప్లేయర్స్ ఉన్నారని వాళ్లకు అవకాశం ఇస్తే వచ్చే ఏడాదిలో జరిగే వన్డే ప్రపంచకప్‌ సమయానికి వాళ్లంతా సిద్ధమవుతారని సీనియర్లు చెబుతున్నారు. ఇన్ని విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.