India Cricket Schedule 2023:  2022 ముగింపునకు వచ్చేసింది. క్రికెట్ కు సంబంధించి ఈ ఏడాది టీమిండియాకు అంతగా కలిసిరాలేదు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లాంటి మెగా ట్రోఫీలను కోల్పోయింది. అలాగే కొన్ని ద్వైపాక్షిక సిరీస్ లను ఓడిపోయింది. ఇక వచ్చే సంవత్సరం కూడా భారత్ కు కొన్ని మేజర్ షెడ్యూళ్లు ఉన్నాయి. అలాగే కొంతమంది స్టార్ ఆటగాళ్ల భవితవ్యం ఏమిటనేది కూడా తేలనుంది. వచ్చే ఏడాది టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం...


1. కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక


ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో ఘోర వైఫల్యం తర్వాత బీసీసీఐ సెలక్షన్ కమిటీని తొలగించింది. అయితే ఇప్పటికీ కొత్త ప్యానెల్ పై నిర్ణయం తీసుకోలేదు. కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక నిర్ణయాన్ని సీఏసీకి అప్పగించారు. మణిందర్ సింగ్, వెంకటేష్ ప్రసాద్ వంటి వారు సెలక్షన్ కమిటీ అధ్యక్షుడి రేసులో ఉన్నారు. ఈ కొత్త ఏడాదిలో న్యూ సెలక్షన్ ప్యానల్ ఏర్పాటు కానుంది. 


2. టీ20 రీబూట్


2007లో ప్రారంభ ఎడిషన్ లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ కప్ అందుకోలేదు. 2021, 2022 లో జరిగిన పొట్టి టోర్నీలో భారత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అందుకే టీ20 ఫార్మాట్లో భారీ మార్పులకు కొత్త సంవత్సరంలో శ్రీకారం చుట్టనుంది బీసీసీఐ. పొట్టి ఫార్మాట్ కు ప్రత్యేక కోచ్, ప్రత్యేక సెలక్టర్ ను నియమించే అవకాశం ఉంది. అలాగే టీ20లకు ప్రత్యేక కెప్టెన్ ను నియమించనున్నారు. హార్దిక్ పాండ్య ఈ రేసులో ఉన్నాడు. 


3. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్


2021లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. రెండేళ్ల తర్వాత మళ్లీ మెన్ ఇన్ బ్లూకి డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలుచుకునే అవకాశం వచ్చింది. ఫైనల్ కు ఇంకా అర్హత సాధించనప్పటికీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఫైనల్ కు చేరువగా ఉంది. భారత్ ఖాతాలో డబ్ల్యూటీసీ ట్రోఫీ కూడా చేరితే ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీలను చేజిక్కించుకున్న జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. 


4. వన్డే ప్రపంచ కప్


వచ్చే సంవత్సరం అక్టోబర్ చివర్లో వన్డే ప్రపంచకప్ ను భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2011లో ధోనీ నాయకత్వంలోని జట్టు వరల్డ్ కప్ అందుకున్నాక ఈ టోర్నమెంట్ ఆతిథ్యం భారత్ కు వచ్చింది. స్వదేశంలో టోర్నీ జరగనుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. కాబట్టి కప్ గెలుచుకునేందుకు భారత్ కు ఇంతకుమించిన అవకాశం దొరకదు. కాబట్టి టీమిండియా మెరుగైన ప్రదర్శనతో కప్ సాధించడానికి ప్రయత్నించాలి. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు.


5. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ


భారత్- ఆస్ట్రేలయాల మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కూడా వచ్చే ఏడాదిలోనే జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో చోటు దక్కించుకోవాలంటే ఈ సిరీస్ భారత్ కు చాలా కీలకం. గత 3 పర్యాయాల్లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోలేదు. 2004 నుంచి ఆస్ట్రేలియా భారత్ లో గెలవలేదు. 4 మ్యాచుల ఈ టెస్ట్ సిరీస్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 


6. ఆసియా కప్


2022లో యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.  ఈ టోర్నీలో టీమిండియా చెత్త ప్రదర్శన చేసింది.  కాబట్టి వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ భారత్ కు చాలా ముఖ్యమైనది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. 


7. కెప్టెన్సీ వారసత్వం


కొత్త ఏడాదిలో బీసీసీఐ కొత్త నాయకత్వంపై దృష్టి పెట్టనుంది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు 35 ఏళ్లు. అతను ఇంకెంతకాలం ఆడతాడో తెలియదు. కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త కెప్టెన్ వెతుకులాటలో ఉంది. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ లో కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్య ముందు వరుసలో ఉన్నాడు. ఇక రెడ్ బాల్ క్రికెట్ లో కేఎల్ రాహుల్ రేసులో ఉన్నాడు. దీనిపై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకోవచ్చు. 


8. రాహుల్ ద్రవిడ్ భవిష్యత్తు


ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ వన్డే ప్రపంచకప్ తర్వాత ముగుస్తుంది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ కోల్పోవటంతో ద్రవిడ్ కోచ్ గా ఈ సంవత్సరం సాఫీగా సాగలేదు. అలాగే టెస్ట్ క్రికెట్లోనూ అంత ఆధిపత్యం చెలాయించలేకపోయింది. కాబట్టి కోచ్ గా ద్రవిడ్ పాత్రపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


9. టీ20ల్లో సీనియర్లు ఆడడంపై నిర్ణయం


కొత్త ఏడాదిలో టీ20 ఫార్మాట్ లో సీనియర్ల పాత్రపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ 30 ఏళ్ల వయసులో ఉన్నారు. జడేజా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి వారు ఎలా ఆడతారో తెలియదు. కాబట్టి పొట్టి టోర్నీల్లో సీనియర్లు ఆడడంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


10. స్ల్పిట్ కోచింగ్


కొత్త సంవత్సరంలో స్ల్పిట్ కోచింగ్ పై బీసీసీఐ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఈ విధానంతో ఇంగ్లండ్ విజయాలు సాధిస్తోంది. అలాగే వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ లను నియమించే విషయంపై కూడా ఆలోచించనుంది.