IND vs SL:   బంగ్లాదేశ్ తో సిరీస్ ముగిసింది. ఇక టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. జనవరి 3 నుంచి భారత్ లో శ్రీలంక పర్యటన మొదలు కానుంది. ఈ సిరీస్ కోసం ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. ఒక నివేదక ప్రకారం, ఈ సిరీస్ కోసం మంగళవారం టీం సెలక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. 


అందుబాటులోకి సీనియర్లు!


బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ కు గాయంతో రోహిత్ దూరమయ్యాడు. జడేజా, బుమ్రాలు టీ20 ప్రపంచకప్ నుంచి జట్టుకు అందుబాటులో లేరు. భువనేశ్వర్ కు విశ్రాంతి ఇచ్చారు. మరి శ్రీలంకతో సిరీస్ కు వీరంతా అందుబాటులో ఉంటారో లేదో చూడాలి. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోహిత్ ఇంకా 100 శాతం ఫిట్ గా లేడు. అతని గురించి మేం రిస్క్ చేయాలనుకోవడంలేదు. అలాగే జడేజా, బుమ్రా ఎన్ సీఏకు చేరుకున్నారు. వారు ఫిట్ నెస్ పరీక్ష క్లియర్ చేస్తే జట్టులోకి వస్తారు. అయితే పనిభారం దృష్ట్యా వారిని వన్డేలకు మాత్రమే సెలెక్ట్ చేస్తాం. ప్రస్తుతం మేం టీ20 లపై దృష్టి పెట్టడంలేదు అని చెప్పారు. ప్రస్తుతం జడేజా, బుమ్రా ఇద్దరూ పూర్తిగా ఫిట్ గా ఉన్నారు. బుమ్రా ఫుల్ టైం బౌలింగ్ చేస్తున్నాడు. జడేజా కూడా బౌలింగ్ వేయడం ప్రారంభించాడు. వీరిద్దరూ జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటారు అని మరో సీనియర్ అధికారి తెలిపారు. 


వీరితో పాటు దీపక్ చాహర్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, కుల్దీప్ సేన్, వెంకటేష్ అయ్యర్ లు కూడా ఎన్ సీఏలో ఉన్నారు. వీరంతా గాయాల నుంచి కోలుకుని ఫిట్ నెస్ తిరిగి సంపాదించడం కోసం శ్రమిస్తున్నారు. శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను ప్రకటిస్తారనే ప్రచారం ఉంది. 


వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటినుంచే దానికి సన్నద్ధమవ్వాలని టీమిండియా భావిస్తోంది. శ్రీలంకతో సిరీస్ కు పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగాలని అనుకుంటోంది.