Hardik Pandya T20 Captain: భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు బీసీసీఐ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనుంది. కొత్త సంవత్సర కానుకగా హార్దిక్ ను పూర్తిస్థాయి టీ20 కెప్టెన్ గా నియమించనుంది. జనవరి 3 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కు రేపు (మంగళవారం) బీసీసీఐ జట్టును ప్రకటించనుంది. అప్పుడే హార్దిక్ ను కెప్టెన్ గా ప్రకటించనున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు అతడే జట్టును నడిపించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐకు చెందిన సీనియర్ అధికారి ఒకరు సమాచారం ఇచ్చారు. 


ఇదే సరైన సమయం 


టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యకు బాధ్యతలు అప్పగించేందుకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, కొందరు ఇతర ఆటగాళ్లు 2024 వరకు కొనసాగే అవకాశం లేదు. కాబట్టి భారత్ క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా టీ20 ఫార్మాట్ కు హార్దిక్ ను పూర్తిస్థాయి నాయకుడిగా ప్రకటించనున్నాం. అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 


వారు వన్డేలకు తిరిగొస్తారు


గాయపడి జట్టుకు దూరమైన భారత త్రయం రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు శ్రీలంకతో వన్డే సిరీస్ కు తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే వారిని టీ20లకు ఎంపిక చేయట్లేదని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం పేలవ ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ లు కూడా టీ20 లకు ఎంపికయ్యే అవకాశం లేదని సమాచారం. పంత్ స్థానంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. 


రోహిత్ వేలి గాయం నుంచి 100 శాతం కోలుకోలేదు. అతని గాయం విషయంలో మేం ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడంలేదు. జడేజా, బుమ్రాలు ఎన్ సీఏలో ఉన్నారు. వారు బాగా కోలుకున్నారు. అలాగే బౌలింగ్ కూడా చేస్తున్నారు. వారిని వన్డేల్లోకి ఎంపిక చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి టీ20లపై లేదు. అని బీసీసీఐ అధికారి తెలిపారు.