సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చిన తరువాత తన ఫ్యామిలీతో కలిసి 'అన్నాత్తే' సినిమాను చూశారు. అయితే గురువారం నాడు సాయంత్రం ఆయన్ను సడెన్ గా కావేరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. రజినీకాంత్ తలనొప్పి, అస్వస్థత కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే ప్రచారం జరిగింది. 


Also Read: బ్రేకింగ్... గుండెపోటుతో క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్‌ మృతి


ఈ రూమర్స్ పై రజినీకాంత్ భార్య లతా స్పందిస్తూ.. ప్రతీ ఏడాది చేయించుకునే రొటీన్ చెకప్ లో భాగంగా ఆయన్ను హాస్పిటల్ కు తీసుకొచ్చామని.. కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. నిజానికి కొన్ని గంటల్లోనే ఆయన ఇంటికి వస్తారని అనుకున్నారు. అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ను చూడడానికి ఆయన కూతురు ఐశ్వర్య హాస్పిటల్ కు కూడా వెళ్లింది. 


తాజాగా రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశాయి. ఈ నెల 28వ తేదీన ఆయన అస్వస్థతకు గురయ్యారని.. తమ ఆస్పత్రిలోని నిపుణుల టీమ్ ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అనే మెడికల్ ప్రొసీజర్ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఆ ప్రొసీజర్ ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కావేరీ ఆస్పత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది.